తెలంగాణ

సీపీఎం పార్టీలో సంచలనం.. తొలిసారి కార్యదర్శిగా దళితుడు

కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో సంచలనం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలిసారి దళిత నేతకు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కాయి. తెలంగాణ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా దళితుడైన జానీ వెస్లీ ఎంపికయ్యారు. ప్రస్తుతం సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం ఉన్నారు. తమ్మినేని స్థానంలో కొత్త కార్యదర్శగా జానీ వెస్లీని ఎంపిక చేశారు. సంగారెడ్డిలో జరిగిన పార్టీ మహాసభల్లో వెస్లీ ఎన్నికను పార్టీ అగ్రనేతలు ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఆ పార్టీకి నాయకత్వం వహించిన మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం రిలీవ్ అయ్యారు. ఈసారి బడుగు బలహీనవర్గాలకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో జాన్ వెస్లీకి అవకాశం ఇచ్చారు. ఈనెల 25న బహిరంగ ప్రదర్శనతో మహాసభలు ప్రారంభం కాగా… ఈ సభల్లో రాష్ట్ర ప్రముఖులతో పాటు జాతీయ నేతలు కూడా పాల్గొన్నారు. జాన్ వెస్లీ స్వస్థలం వనపర్తి జిల్లా అమరచింత. గతంలో DYFI, కులవివక్ష వ్యతిరేక పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా వెస్లీ పనిచేశారు.

తనను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయడంపై జాన్ వెస్లీ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేదలు, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. పెట్టుబడిదారులకు, భూస్వాములకు ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు . రైతులు, కూలీలు,కార్మికుల సమస్యలను ప్రభుత్వాలు మాట తప్పుతున్నాయని.. బాధితులకు అండగా సీపీఎం పనిచేస్తుందని భరోసా ఇచ్చారు.

 

Back to top button