
1.భూ భారతిలో లోపం ఉందా?.. ప్రభుత్వ ఖజానాకు రాకుండా దారి మళ్లింది రూ.42 కోట్లు మాత్రమేనా?
2.స్టాంపు డ్యూటీ సొమ్ము కాజేతలో
భారీ కుంభకోణం జరిగిందన్న అనుమానాలు
క్రైమర్ మిర్రర్,తెలంగాణ:- రాష్ట్రంలో కొత్త కుంభకోణం వెలుగు చూసింది. కొందరు మీసేవ కేంద్రాల నిర్వాహకులు భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను ప్రభుత్వ ఖజానాకు జమ కాకుండా స్వాహా చేసినట్లు వెల్లడైంది. కొనుగోలుదారులు చెల్లించిన స్టాంపు డ్యూటీ మొత్తంలో 10 శాతం మాత్రమే ప్రభుత్వానికి చేరేలా చేసి.. 90 శాతం సొమ్మును తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తేలింది. తొలుత ఇది యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలకు మాత్రమే పరిమితమైందని అనుకున్నప్పటికీ.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్రమం చోటుచేసుకున్నట్లు నిర్ధారణ అయింది. ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ములో రూ.42 కోట్లను అక్రమార్కులు కాజేశారని తమ విచారణలో వెల్లడైనట్లు అధికారులు ప్రకటించారు. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కుంభకోణంలో ఇంత తక్కువ మొత్తం ఉండబోదని, సర్కారుకు భారీగానే నష్టం చేకూరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు అసలు విషయాన్ని దాచిపెట్టి.. కొసరు మాత్రమే వెల్లడిస్తున్నారని అంటున్నారు.
Read also : సంక్రాంతికి ఊరెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై భూమేష్ సూచన
స్టాంపు డ్యూటీ కుంభకోణం జరగడానికి కారణం భూ భారతి పోర్టల్ లో లోపాలేనన్న విమర్శలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణిని పక్కన పెడుతూ.. కాంగ్రెస్ సర్కారు లోపభూయిష్టమైన భూ భూరతిని తీసుకొచ్చిందనే ఆరోపణలూ వెల్లువెత్తున్నాయి. అయితే.. ఈ కుంభకోణం భూ భారతి వచ్చాక ప్రారంభమైంది కాదని, ధరణి అమల్లో ఉన్నప్పటి నుంచి కొనసాగుతోందని సీసీఎల్ఏ ఆడిట్ లో తేలినట్లు అధికారులు చెబుతున్నాయి. ఆరేళ్ల క్రితం 2020లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను ధరణి ద్వారా తహసీల్దార్లకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అప్పగించింది. అయితే మీసేవ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంపు డ్యూటీ చెల్లించాక.. అవి ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యాయా, ఎంత జమ అయ్యాయి అని తహసీల్లార్లు క్రాస్ చెక్ చేసే వ్యవస్థను పోర్టల్ లో ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ అంశాన్ని చెక్ చేయకుండానే తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు అక్రమార్కులు స్టాంపు డ్యూటీ చెల్లింపు సమయంలోనే మాల్ వేర్ ను ఉపయోగించి దోపిడీకి పాల్పడ్డారు. భూ భారతి పోర్టల్ కు నకిలీ చెల్లింపు యాప్ ను జోడించి.. కొనుగోలుదారులు చెల్లించిన మొత్తం సొమ్మును ప్రభుత్వ ఖాతాలో జమ చేసినట్లుగా రసీదు ఇచ్చారు. కానీ, ఆ తరువాత అందులో 10 శాతానే ప్రభుత్వ ఖాతాకు పంపించి మిగిలిన మొత్తాన్ని తమ ఖాతాలకు మళ్లించుకున్నారు.
Read also : రైతు భరోసా అప్డేట్: జనవరి 26 నుండి భూమి లేని రైతు కూలీలకు కూడా..!
గత ఆరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల లావాదేవీలు జరగగా.. ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ రూపంలో రూ.13 వేల కోట్లు వచ్చాయని సీసీఎల్ఏ ఆడిట్లో తేల్చారు. అయితే ఇందులో 4300 లావాదేవీలకు సంబంధించిన స్టాంపు డ్యూటీ మాత్రం మొత్తం జమ కాలేదని గుర్తించారు. వీటి ద్వారా రూ.42 కోట్లు దారి మళ్లినట్లు నిర్ధారించారు. ఇందుకు భూ భారతిలోని లోపాలనే అక్రమార్కులు వాడుకున్నట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై లోతైన విచారణ జరపనున్నట్లు, ఈ 4300 లావాదేవీలను మరోసారి ఆడిట్ చేసి.. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వానికి రాకుండాపోయిన రూ.42 కోట్లను రికవరీ చేయనున్నట్లు తెలిపారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అధికారులు చెబుతున్న లెక్కలపై మాత్రం అందరిలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆరేళ్లుగా కుంభకోణం జరిగితే.. అది కూడా 52 లక్షల లావాదేవీలు జరిగి.. ప్రభుత్వానికి రూ.13 వేల కోట్ల ఆదాయం సమకూరినప్పడు.. అక్రమానికి అవకాశం ఉన్నచోట రూ.42 కోట్లే పక్కదారి పట్టాయా? అన్నది అనుమానంగా మారింది. పైగా, మీసేవ కేంద్రాల నిర్వహకులు మాత్రమే ఈ కుంభకోణానికి పాల్పడ్డారా?వారికి రెవెన్యూ శాఖ నుంచి సహకారం అందిందా? అన్నదీ అనుమానంగా మారింది. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.





