Suspected Pak Drones: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో కొద్దికాలంగా సైలెంట్ గా ఉన్న ఉన్న పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. జమ్మూకశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో అనుమానాస్పదంగా ఐదు డ్రోన్లు సంచరిస్తున్నట్టు భారత సైన్యం గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు వాటిని తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తినష్టం కానీ, ప్రాణనష్టం కానీ జరగలేదు.
డ్రోన్లను కూల్చేసిన భారత సైన్యం
భారత సైనిక వర్గాల సమచారం ప్రకారం, పాకిస్థాన్ ఆర్మీకి చెందిన కొన్ని డ్రోన్లు ముఖ్యంగా నౌషెరా-రాజౌరీ సెక్టార్‌లో సంచరిస్తున్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే సైనిక విభాగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. మీడియం, లైట్ మిషన్‌గన్‌లతో కాల్పులు జరిపాయి. పాక్ డ్రోన్ కదలికలతో ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భద్రత, నిఘాను మరింత కట్టుదిట్టం చేశామని, భారత బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని ఆర్మీ అధికారులు చెప్పారు.
గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు
త ఏడాది మే 7న పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పలు పాక్ డ్రోన్లను కూల్చేసింది. అప్పటి నుంచి డ్రోన్ల సంచారం తగ్గింది. అయితే తిరిగి డ్రోన్ల కదలికలు కనిపించడంతో ఉగ్రవాద గ్రూపులకు మద్దతుగా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు జారవిడిచేందుకు డ్రోన్లను ఉపయోగించినట్టుగా అనుమానిస్తున్నారు. దీంతో భద్రతా బలగాలు పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.





