
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- “ఏసీబీ దాడులు సూర్యాపేట జిల్లాలో కలకలం రేపుతున్నాయి. జిల్లా కేంద్రంలో కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బృందం ప్రైవేటు ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి.. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత జిల్లాలో అర్హత గల డాక్టర్లు లేని పలు ప్రైవేటు ఆసుపత్రులు స్వతహాగా మూసి వేయగా, ఓ స్కాన్ సెంటర్ నిర్వాహకుడు అర్హత లేకుండానే స్కాన్ చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపణలు పెద్ద ఎత్తున వెలువడ్డాయి. ఈ తరుణంలోనే ఐఎంఏ డాక్టర్స్ డీఎస్పీ పార్థసారథికి, టౌన్ సీఐ రాఘవులకి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఈ మధ్యకాలంలో ఫిర్యాదు చేశారు.
ఈ విషయం పై విచారణ చేపట్టిన సూర్యాపేట టౌన్ సీఐ వీర రాఘవులు కేసు విషయంపై డీఎస్పీ దగ్గర సెటిల్మెంట్లు చేసుకోండి అంటూ పంపించాడని ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు. సోమవారం సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో రెండున్నర గంటల పాటు విచారణ చేసిన ఏసీబీ ఆధికారులు సూర్యాపేట టౌన్, సూర్యాపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఫిర్యాదుదారుడు నుండి 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసి 16 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదు దారుడు ఇచ్చిన పిటిషన్ మేరకు విచారణ చేసి సూర్యాపేట పట్టణ సీఐ రాఘవులు, డీఎస్పీ పార్థసారథి పై కేసు నమోదు చేసి కస్టడీలో పెట్టామని నల్గొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు. ఈ తనిఖీల ల్లో నల్గొండ ఏసీబీ ఏఎస్పీ కమలాకర్ రెడ్డి, నల్గొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్, నల్గొండ రేంజ్ ఏసీబీ టీమ్ తదితరులు పాల్గొన్నారు.”