క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘పూరి గుడిసెలు లేని రాష్ట్రం’గా మార్చాలనే లక్ష్యంతో, ప్రస్తుతం ఉన్న పూరి గుడిసెలు మరియు టార్పాలిన్లతో ఏర్పాటు చేసుకున్న ఇళ్లపై ప్రత్యేక సర్వే నిర్వహించాలని నిర్ణయించింది.
హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2026 మార్చి నాలుగో వారంలో గ్రామాల వారీగా ఈ క్షేత్రస్థాయి సర్వే జరగనుంది. ఈ సర్వేలో గుర్తించిన నిరుపేదలకు ప్రాధాన్యతనిస్తూ ‘ఇందిరమ్మ ఇళ్లు’ కేటాయిస్తారు. ఇప్పటికే మంజూరైన లబ్ధిదారుల్లో ఎవరైనా ఇళ్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపకపోతే, వారి స్థానంలో ఈ సర్వే ద్వారా గుర్తించిన అర్హులకు అవకాశం కల్పిస్తారు.
ఇంటి నిర్మాణం కోసం ఒక్కో లబ్ధిదారునికి ₹5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. 2026 ఏప్రిల్ నుండి ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మార్చి 2026 చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1 లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అర్హత ప్రమాణాలు…
దరఖాస్తుదారులు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.
సొంతంగా పక్కా ఇల్లు ఉండకూడదు (పూరి గుడిసెలు లేదా కచ్చా ఇళ్లలో నివసించే వారికి ప్రాధాన్యత).
తెల్ల రేషన్ కార్డు (FSC) కలిగి ఉండాలి.
తక్కువ ఆదాయ వర్గాలకు (SC, ST, BC, మైనారిటీలు మరియు ఆర్థికంగా వెనుకబడిన వారు) ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
