
-
బూజు పట్టిన బ్రెడ్స్‌పై ఫిర్యాదు.. ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్
-
ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదు: జోనల్ అధికారి హెచ్చరిక
మర్రిగూడ, క్రైమ్ మిర్రర్: మర్రిగూడలోని స్నేహ ఫుడ్స్ బ్రెడ్ తయారీ కేంద్రంపై ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ జోనల్ అధికారి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వినియోగదారులకు బూజు పట్టిన బ్రెడ్స్ అందుతున్నాయంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు అందడంతో అధికారులు వెంటనే స్పందించారు. ఫిర్యాదు మేరకు స్నేహ ఫుడ్స్ ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టి తయారీ ప్రక్రియ, నిల్వ విధానాలు, శుభ్రత ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా బ్రెడ్ తయారీకి ఉపయోగిస్తున్న పరిసరాలు, ప్యాకేజింగ్ ప్రాంతం, ముడి పదార్థాల నిల్వపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ క్రమంలో పలు బ్రెడ్ శాంపిళ్లను మరియు ఉపయోగిస్తున్న కెమికల్స్‌ను పరిశీలన నిమిత్తం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నమూనాలను ప్రయోగశాలకు పంపించి నాణ్యత, భద్రత ప్రమాణాలపై నివేదిక పొందనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జోనల్ అధికారి జ్యోతిర్మయి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.
ఆహార పదార్థాలు తప్పనిసరిగా పరిశుభ్ర వాతావరణంలో, ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా తయారు చేయాలని నిర్వాహకులకు స్పష్టంగా సూచించారు. ఫుడ్ సేఫ్టీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించడంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.





