Supreme Court On Reservations: రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర రిజర్వేషన్ల మీద విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు కీలక తీర్పు చెప్పింది. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోయే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు సహా అన్ని రిజర్వేషన్లు యాభై శాతం దాటకుండా చూడాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బాంటియా కమిషన్ సిఫార్సుల మేరకు ఓబీసీ రిజర్వేషన్లను పెంచి అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని కొట్టివేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది.
ట్రిపుల్ టెస్ట్ పేరుతో మూడు షరతులు
గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించగా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఓబీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ట్రిపుల్ టెస్ట్ పేరుతో మూడు షరతులు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇదే అంశం మీద డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. కమిషన్ ఓబీసీల వెనుకబాటుతనం మీద ప్రతీ స్థానిక సంస్థ స్థాయిలో విశ్వసనీయమైన డేటాను సేకరించాలి. ఆ డేటా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ కోటాను నిర్ణయించాలి. కోటాను నిర్ణయించే క్రమంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాన్ని అనుసరించి మహారాష్ట్ర ప్రభుత్వం బాంటియా కమిషన్ వేసింది. కమిషన్ సూచన మేరకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. దాన్ని అమలు చేసే క్రమంలో రిజర్వేషన్లు 50 శాతం దాటాయంటూ ఇతరులు వేసిన పిటిషన్లు సుప్రీం విచారించింది ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది.
50 శాతం రిజర్వేషన్లు దాటకూడదు!
ఏ మార్పులు చేసినా రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించిన 50 శాతం గీత దాటకుండా చూడాల్సిందేనని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఓబీసీ రిజర్వేషన్లనే చర్చిస్తున్నప్పటికీ మొత్తం వర్టికల్ రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని జస్టిస్ బాగ్చీ తేల్చిచెప్పారు. విచారణను ఈనె 19కి వాయిదా వేశారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయగా హైకోర్టు జీవోపై స్టే ఇచ్చింది. స్టే నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దాంతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయాయి.





