Saturday, March 14, 2026
HomeజాతీయంSupreme Court: యాసిడ్ దాడి కేసుపై సుప్రీం విచారణ, నిందితుల ఆస్తుల వేలంపై కీలక వ్యాఖ్యలు!

Supreme Court: యాసిడ్ దాడి కేసుపై సుప్రీం విచారణ, నిందితుల ఆస్తుల వేలంపై కీలక వ్యాఖ్యలు!

యాసిడ్ దాడుల కేసుల్లో బాధితులకు జీవితాంతం చికిత్స, పునరావాసం కోసం ప్రస్తుతం ఇస్తున్న రూ.3లక్షల పరిహారం సరిపోదని, మరింత మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. యాసిడ్ దాడుల కేసుల్లో నిందితుల ఆస్తులను వేలం వేసి బాధితులకు పరిహారంగా ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించింది. ఇలాంటి దారుణమైన నేరాలను నివారించేందుకు ఆసాధారణ శిక్షలు ఉండాలని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. 2009లో యాసిడ్ దాడి బాధితురాలు, బ్రేవ్ సోల్స్ ఫౌండేషన్ (ఎన్జీఓ) వ్యవస్థాపకురాలు షాహీన్ మాలిక్ వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు విచారణ జరిపింది.

16 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం

ఈ కేసు విషయంలో తాను 16 ఏళ్లుగా పోరాడుతున్నానని, అయితే ట్రయిల్ కోర్టులో నిందితులందరూ విడుదల అయ్యారని షాహీన్ మాలిక్ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. యాసిడ్ దాడి జరిగినప్పుడు తన వయస్సు 26 ఏళ్లని, ఇప్పుడు 42 ఏళ్లని చెప్పారు. తన జీవితంలో విలువైన కాలాన్ని ఈ కేసు కోసం జరిపిన పోరాటంలోనే కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ తాను ఎక్కడున్నానో అర్ధం కావడం లేదన్నారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ, బాధితురాలి తరఫున హైకోర్టు నుంచి మంచి లాయర్‌తో కేసు వాదించేలా సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

కోర్టు కీలక ఆదేశాలు

యాసిడ్ దాడులకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడాది వారీగా జరిగిన యాసిడ్ దాడులు, చార్జిషీటులు ఎన్ని దాఖలయ్యాయి, కోర్టుల్లో కేసులో ఏ దశలో ఉన్నాయి, బాధితుల కోసం చేపట్టిన పునరావాస చర్యలపై నాలుగు వారాల్లోగా వివరాలు అందించాలని ఆదేశించింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments