Monday, March 23, 2026
HomeతెలంగాణSupreme Court: సోషల్ మీడియా పోస్టులపై కేసులు, సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!

Supreme Court: సోషల్ మీడియా పోస్టులపై కేసులు, సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!

సోషల్‌ మీడియా పోస్టులు, రాజకీయ విమర్శలకు సంబంధించి హైకోర్టు మార్గదర్శకాలు సమర్థనీయమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత కోర్టులపై ఉందని స్పష్టం చేసింది. యాంత్రికంగా కేసుల నమోదును నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ పార్టీపై, సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. దుర్గం శశిధర్‌గౌడ్‌ అలియాస్‌ నల్ల బాలు, జి.సతీశ్‌, వసీం అక్రం, కౌతం సతీశ్‌లపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

కేసులు కొట్టివేసిన హైకోర్టు

ఈ కేసుపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన జస్టిస్‌ తుకారాంజీ ఆ మూడు ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు సంబంధించి కేసులు నమోదు అంశంలో పోలీసులు, మేజిస్ట్రేట్‌ కోర్టులకు పలు మార్గదర్శకాలు జారీచేశారు. ట్వీట్లు/పోస్టులు చట్టబద్ధమైన రాజకీయ వ్యక్తీకరణ పరిధిలోకి వస్తాయన్నారు.  ప్రాథమిక హక్కుల పరిరక్షణతోపాటు కేసుల నమోదు, విచారణ యాంత్రికంగా, ఏకపక్షంగా జరగకుండా నిరోధించే క్రమంలో మార్గదర్శకాలను జారీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు..

హైకోర్టు మార్గదర్శకాలను సమర్థించిన సుప్రీం కోర్టు  

హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. హైకోర్టు మార్గదర్శకాలు దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగిస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై సోమవారం జస్టిస్‌ జే.బీ.పార్దీవాలా, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్ర వాదనలు వినిపించారు. హైకోర్టు విధించిన కొన్ని మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయని, తీర్పులోని పేరా 29లో ఇచ్చిన మార్గదర్శకాలపై అభ్యంతరం ఉందని వివరించారు.  ఈ సందర్భంగా జస్టిస్‌ పార్దీవాలా జోక్యం చేసుకుంటూ..  హైకోర్టు మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేముంది? పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి హైకోర్టు మార్గదర్శకాలు ఇవ్వకూడదా? అని ప్రశ్నించారు. ఒక హైకోర్టు జ్యుడిషియల్‌ ఆర్డర్‌ ద్వారా కొన్ని మార్గదర్శకాలు ఇస్తే.. సంబంధిత అధికారులు వాటిని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.  హైకోర్టు మార్గదర్శకాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తమకేమీ కనిపించడం లేదంటూ.. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేశారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments