
Suicide: టీ పెట్టలేదన్న చిన్న కారణమే ఓ యువతి ప్రాణాలు తీసిన విషాద ఘటనగా మారింది. కుటుంబంలో జరిగిన స్వల్ప వాగ్వాదం చివరకు ఆత్మహత్యకు దారితీయడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ ఘటనతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమిల్లి పంచాయతీ చింతాయిగూడేనికి చెందిన దండుబోయిన ఏసుబాబు, కృష్ణవేణి దంపతుల కుమార్తె అనూష (22) ఇంటర్ వరకు చదివి.. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ కుటుంబానికి సహకరిస్తూ ఉండేది.
ఈ నెల 27న ఇంట్లో టీ పెట్టాలని తల్లి కృష్ణవేణి అనూషను కోరింది. అయితే టీ పెట్టనని అనూష మొండికేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన అనూష తీవ్రంగా అలిగి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. కొంతసేపటి వరకు అనూష బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తలుపులు తట్టినా స్పందన లేకపోవడంతో కిటికీ ద్వారా లోపలికి చూసిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. గదిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని అనూష వేలాడుతూ కనిపించింది.
వెంటనే తలుపులు పగులగొట్టి ఆమెను కిందకు దించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె పరిస్థితిలో మెరుగుదల రాలేదు. కొద్ది గంటల పాటు చికిత్స పొందుతూ అనూష బుధవారం మృతి చెందింది. ఈ వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్న మాట, క్షణికమైన ఆవేశం ఇంతటి అనర్థానికి దారితీయడంపై గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
ALSO READ: తెలంగాణలో కొత్త పార్టీ.. ఈసీకి దరఖాస్తు?





