
చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్:-యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, తూప్రాన్ పేట్ గ్రామ పరిధిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్ లో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా, విఠలాపురం గ్రామానికి చెందిన సంధ్య (10), బీసీ గురుకుల బాలికల పాఠశాలలో ఐదో తరగతి చదువుతుంది. విద్యార్థిని ఆదివారం రాత్రి పాఠశాలలో స్టడీ అవర్స్ నిర్వహణ తర్వాత హాస్టల్ భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కొత్తగా వచ్చిన విద్యార్థులకు పాఠశాలలో హోమ్ సిక్ హాలిడేస్ ఇవ్వటంతో సంధ్యను తన తల్లిదండ్రులు వారి స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఆదివారం తిరిగి తల్లిదండ్రులు విద్యార్థిని సంధ్యను హాస్టల్ కు తీసుకవచ్చారు. రాత్రి స్టడీస్ తర్వాత విద్యార్థులంతా వారి వారి గదులలోకి పడుకోవడానికి వెళ్ళినప్పుడు విద్యార్థిని సంధ్య భవనంపై దూకి ఆత్మహత్యకి పాల్పడినట్లు తెలిసింది. తెల్లవారుజామున వాచ్ మెన్ చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంధ్య ఆత్మహత్యకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ సంఘటన తో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమాస్టరం కోసం విద్యార్థిని మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనతో అధికారులు, స్థానికులు, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ దుర్ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.