జాతీయం

ఉత్తరాదిని వణికించిన భూకంపం, ఢిల్లీలో ప్రకంపనలు!

Earthquake: ఉత్తర భారతాన్ని భూకంపం వణికించింది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కొన్ని సెకెన్ల పాటు భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద 4.4గా నమోదు అయ్యింది. ఢిల్లీ ఎన్సీఆర్ లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఉదయం 9.04 గంటలకు భూకంపం

ఢిల్లీ-హర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్‌ లోనూ బలమైన భూకంపం ఏర్పడింది. సుమారు 10 సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగాయి. ఉదయం 9.04 గంటలకు భూమి కంపించింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, భివానీ, బహదూర్‌ గఢ్ సహా అనేక నగరాల్లో భూకంపం సంభవించింది. జజ్జర్‌ లో రెండు నిమిషాల్లో రెండు భూకంపాలు సంభవించాయి. ఉదయం 9:07 గంటలకు  మొదటి భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఉదయం 9:10 గంటలకు తిరిగి స్వల్పంగా భూమి కంపించింది.  నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ.. భూకంప కేంద్రం జజ్జర్‌ కు ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వెల్లడించింది.

భయంతో బయటకు పరుగులు తీసిన జనం

భూకంపంతో జనాలు వణికిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం రోజు వారీ పనుల్లో బిజీగా ఉండగా ఈ భూకంపం సంభవించడంతో అందరూ అలర్ట్ అయ్యారు. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

తీవ్రత పెరిగితే ముప్పు తప్పదా?

అటు భూకంపం రావడానికి కొన్ని గంటల ముందు ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌ లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల రోడ్డుపై నిలిపిన వాహనాలు నీటిలో టైర్ల వరకు మునిగిపోయాయి. రోడ్లపైకి నీళ్లు చేరడంతో వాహనదారులు, ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. వర్షాల నేపథ్యంలో ఇళ్లన్నీ తడిసిపోయి ఉన్నాయి. భూకంప తీవ్రత మరికాస్త పెరిగితే తీవ్ర ముప్పు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Read Also: ఆకస్మిక వరదలు.. పడవల్లా కొట్టుకుపోయిన ఇండ్లు!

Back to top button