PC Act Applies: కేంద్ర ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలు ఉంటే, రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర అవినీతి నిరోధక శాఖలు దర్యాఫ్తు చేయవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సీబీఐ అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది. రాష్ట్ర ఏజెన్సీ దాఖలు చేసిన చార్జ్ షీట్ చెల్లుబాటు అవుతుందని, కేవలం కేంద్ర ఉద్యోగి అనే కారణంతో దాన్ని కొట్టివేయలేమని కోర్టు తెలిపింది. ఫెడరల్ షీల్డ్ అంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ఓ కేంద్ర ప్రభుత్వ అధికారిపై రాష్ట్ర ఏసీబీ నమోదు చేసిన అవినీతి కేసును కొట్టివేయడానికి రాజస్థాన్ హైకోర్టు నిరాకరించింది. ఆ తీర్పుపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ తీర్పు వెలువడింది. కేంద్ర ఉద్యోగిగా, తాను ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ పర్యవేక్షణకు మాత్రమే లోబడి ఉండాలని, తనపై రాష్ట్రం నేతృత్వంలో జరిగే ఏ దర్యాఫ్తు అయినా చట్టబద్ధంగా చెల్లదని పిటిషనర్ వాదించారు. ఈ వాదనను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. అలాంటి రక్షణ ఉండదని తేల్చి చెప్పింది.
సీబీఐ ముందస్తు అనుమతి అవసరం లేదు!
ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వ అధికారులపై అవినీతి కేసులను కేవలం సీబీఐ మాత్రమే విచారణ చేయాలనే భావన ఉండేది. తాజా తీర్పుతో ఆ అపోహకు తెరపడింది. అవినీతి నిరోధక చట్టం, 1988 ప్రకారం కేంద్ర ఉద్యోగిని దర్యాఫ్తు చేయడం కోసం సీబీఐ ముందస్తు అనుమతి అవసరం లేదని సుప్రీం కోర్టు వెల్లడించింది. కాగా, స్థానిక అవినీతి నిరోధక పరిశీలన నుంచి తప్పించుకోవడానికి కేంద్ర ఉద్యోగులు తమ ఫెడరల్ హోదాను కవచంగా ఉపయోగించుకోకుండా ఈ తీర్పు నిరోధిస్తుంది.





