
Projects Update: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వానలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా నది మీద నిర్మించిన అన్ని ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో మూడు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
శ్రీశైలం ఇన్ ఫ్లో ఎంత అంటే?
ఇక శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు విద్యుదోత్పత్తి ద్వారా 28,658 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 94,878 క్కూసెక్కులు, సుంకేసుల నుంచి 57,515 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. బుధవారం సాయంత్రానికి 1,87,915 క్యూసెక్కుల వరద రిజర్వాయర్ చేరుతున్నట్లు డ్యామ్ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.40 అడుగుల మేర నీరున్నది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201.1205 టీఎంసీల నిల్వ ఉన్నది.
నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి సంబంధించిన 3 గేట్లు 10 అడుగుల మేర పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు డ్యామ్ అధికారులు తెలిపారు. కుడి, ఎడమ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. వీటి ద్వారా మరో 67,299 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల అవుతున్నది. మొత్తంగా నాగార్జునసాగర్ కు 1, 17,090 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. సాగర్ లో 4,646 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 535.50 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 177 టీఎంసీలుగా ఉంది. వరదల ప్రవాహం ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో సాగర్ నిండే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: జూలై 12 వరకు వానలు.. ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ!