
Projects Updates: ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో శ్రీశైలం రిజర్వాయర్ క్రెస్ట్ గేట్లను రేపు (జూలై 8న) తెరిచే అవకాశం ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా , ప్రస్తుతం 881 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. శ్రీశైలం ఇన్ ఫ్లో లక్షా 80 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 23 వేల క్యూసెక్కులు రాయలసీమ ప్రాజెక్టులకు వెళ్తున్నాయి. మరో 70 వేలు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల ద్వారా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు.
నిండిన శ్రీశైలం ఎగువ ప్రాజెక్టులు
శ్రీశైలం ఎగువన కృష్షా నదిపై ఉన్న ఆల్మట్టి, నారాయణపుర, జూరాల రిజర్వాయర్లు దాదాపుగా నిండాయి. ఈ నేపథ్యంలో పైనుంచి వస్తున్న నీటిని యధాతథంగా దిగువకు విడుదల చేస్తున్నారు. మరో వైపు తుంగభద్ర నుంచి 65 వేల క్యూసెక్కులు శ్రీశైలానికి వచ్చి చేరుతున్నాయి. తుంగభద్ర గేట్లలో ఒకటి బలహీనంగా ఉండటం వల్ల పూర్తి నిల్వ సామర్థ్యం 100 టిఎంసీలకు గాను ప్రస్తుతానికి 80 టిఎంసీలు మాత్రమే నిల్వచేయాలని డ్యామ్ ఇంజనీర్లు నిర్ణయించారు. తుంగభద్ర నీటి నిల్ల ప్రస్తుతం 78 టిఎంసీలకు చేరింది. ఈ సాయంత్రం పై నుంచి వచ్చే 73 వేల క్యూసెక్కులను దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తారు. కృష్ణా ఉపనది భీమాపై మహారాష్ట్ర పుణే సమీపంలో ఉన్న ఉజ్జయినీ రిజర్వాయర్ కూడా నిండింది. రేపు సాయంత్రానికి ఉజ్జయినీ గేట్లు కూడా ఎత్తివేసే అవకాశం ఉంది. భీమా జలాలు జూరాల ప్రాజెక్టు ఎగువన కర్ణాటకలోని భీమ శంకరం వద్ద కృష్ణా నదిలో కలుస్తాయి.
10 రోజుల్లో నిండనున్న నాగార్జునసాగర్
రేపు సాయంత్రం శ్రీశైలం గేట్లు తెరిస్తే మరో పది రోజుల్లో నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండుతుంది. ప్రస్తుతం జలాశయం 52 శాతం నిండింది.
Read Also: ఇవాళ భారీ, రేపు అతి భారీ వర్షాలు, ఏ జిల్లాల్లో అంటే?