దేశంలో మావోయిస్టులు లేకుండా చేసేందుకు కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. ఓవైపు మావోయిస్టు కీలక నేతల ఎన్‌కౌంటర్లతో పాటు మరోవైపు సరెండర్లను కొనసాగిస్తుంది. గత నెలలో మావోయిస్టు టాప్ కమాండర్ హిడ్మాను ఎన్‌కౌంటర్ చేసిన భద్రతా బలగాలు.. ఇప్పుడు పాపారావు అలియాస్ మోంగు, బర్సా దేవా అనే మరో ఇద్దరు కీలక నేతలపై దృష్టి సారించాయి. వీరిద్దరూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సభ్యులు కానప్పటికీ.. వారితో బలమైన సంబంధాలు కలిగి ఉన్నారు.
సౌత్ బస్తర్ లో 150 మంది మావోయిస్టులు
ఛత్తీస్ గఢ్ దక్షిణ బస్తర్ ఇప్పటికీ 150 మంది మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. వారితో మోంగు, బర్సా దేవా మంచి సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిద్దరినీ భద్రతా బలగాలు మోస్ట్ వాంటెట్ జాబితాలో చేర్చాయి. 48 ఏళ్ల బర్సా దేవా మావోయిస్టు పార్టీ కీలకమైన గెరిల్లా బెటాలియన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఆయనది కూడా సుక్మా జిల్లాలోని హిడ్మా స్వగ్రామం పూవర్తి. 57 ఏళ్ల పాపారావు సుక్మా జిల్లాలోని కిష్టారానికి చెందిన గిరిజనుడు. వీరిద్దరూ మావోయిస్టుల ప్రధాన కేంద్రమైన దక్షిణ బస్తర్‌కు ఇన్‌చార్జ్ లుగా ఉన్నారు. బర్సా దేవా నేతృత్వంలోని ది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ ఒక్కటే ఇంకా క్రియాశీలంగా ఉందని బస్తర్ ఐజీ పీ సుందర్‌రాజ్ వెల్లడించారు. భద్రతా బలగాలు ఇప్పుడు పాపారావు, దేవాలను గుర్తించేందుకు ఆపరేషన్లను ముమ్మరం చేశాయి.
బస్తర్ లో 96 ఎన్ కౌంటర్లు
2025లో డిసెంబరు 9 వరకు బస్తర్‌లో 96 ఎన్‌కౌంటర్ల ఘటనలు జరిగాయి. వీటిల్లో 252మంది యావోయిస్టులు మరణించగా.. 23మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. భద్రతా బలగాల ఎన్‌కౌంటర్లలో చనిపోయిన వారిలో సీపీఐ మావోయిస్టు కీలక నాయకుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు మరో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. కాగా, ఇదే సమయంలో పోలీస్ ఇన్‌ఫార్మర్ల నెపంతో ఈ ఏడాదిలో మావోయిస్టులు 46 మంది పౌరులను చంపేశారు. దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2014లో 126 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉండగా.. ఈ ఏడాదికి ఆ సంఖ్య 11కు పడిపోయింది.





