- టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు షాక్
- టీమిండియాను 76 పరుగుల తేడాతో చిత్తు చేసిన సఫారీలు
పొట్టి ప్రపంచకప్ లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టుకు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. ఏకపక్ష పోరులో టీమిండియాను ఒత్తిడిలో పడేసి.. 76 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇరుజట్లు ఇన్నింగ్స్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాయి. కానీ, డేవిడ్ మిల్లర్(63), డెవాల్డ్ బ్రెవిస్(45)ల మెరుపులతో కోలుకున్న సౌతాఫ్రికా మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తీసుకుంది.. ఆపై పేసర్ల విజృంభణతో అజేయ భారత్‌కు ఓటమిని రుచి చూపించింది. భారీ ఛేదనలో టాపార్డర్ కుప్పకూలగా.. ఆపద్భాందవుడు సూర్యకుమార్ యాదవ్(18) సైతం తేలిపోయాడు. శివం దూబే(43) ఒంటరిపోరాటం చేసినా అది సరిపోలేదు.
టీ-20 ప్రపంచ కప్‌లో చెలరేగిన సఫారీ టీమ్
ఐసీసీ ఈవెంట్లలో ఒత్తిడికి లోనయ్యే దక్షిణాఫ్రికా టీ-20 ప్రపంచ కప్‌లో చెలరేగిపోతోంది. గ్రూప్ డీ నుంచి టాపర్ గా సూపర్ 8కు దూసుకొచ్చిన సఫారీ టీమ్.. తొలి మ్యాచ్‌లో ఫేవరెట్ భారత్‌ను ఓడించింది. 188 పరుగుల చేదనలో టీమిండియాను కార్బిన్ బాస్చ్(2-12), మార్కో యాన్సెన్(4-22)లు సత్తా చాటారు. తొలి ఓవర్లోనే ఓపెనర్ ఇషాన్ కిషన్(0)ను ఎడెన్ మర్క్ రమ్ ఔట్ చేయగా.. యాన్సెన్ తొలి బంతి ఎడ్జ్ తీసుకోగా తిలక్ వర్మ(1) వికెట్ కీపర్ డికాక్ చేతికి చిక్కాడు. ఆదిలోనే రెండు వికెట్లు పడిన వేళ.. ఓపెనర్ అభిషేక్ శర్మ(15) 6, 4తో ఆశలు రేపినా.. యాన్సెన్ అతడిని బోల్తా కొట్టించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(18), వాషింగ్టన్ సుందర్(11)లు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ, ఈ ద్వయాన్ని విడదీస్తూ సుందర్‌ను కార్బిన్ బాస్చ్ పెవిలియన్ చేర్చాడు. రన్‌రేటు ఒత్తిడిలో గేర్ మార్చాలనుకున్న సూర్య తేఇలికైన క్యాచ్‌తో వికెట్ ఇచ్చేశాడు. దాంతో.. 51వద్ద ఐదో వికెట్ పడింది. హార్దిక్ పాండ్యా(18), శివం దూబే(43)లకుపెద్ద షాట్లు ఆడేందుకు సఫారీలు అవకాశం ఇవ్వకపోవడంతో.. బౌండరీలు కరువయ్యాయి.
76 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విన్
మహరాజ్ ఓవర్లో సిక్సర్‌కు యత్నించిన పాండ్యా బౌండరీ లైన్ వద్ద స్టబ్స్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. మూడో బంతికి రింకూ సింగ్ సైతం స్టబ్స్‌కు దొరికాడు. అక్కడితో భారత ఓటమి ఖాయమైంది. ఆశ్యర్యంగా.. అర్ష్ దీప్ కూడా పాండ్యా స్టయిల్లోనే స్టబ్స్ కు చిక్కాడు. దూబే సిక్సర్లతో పరుగుల అంతరం తగ్గించాడంతే. దూబే, బుమ్రాలు వెంటవెంటనే ఔటవ్వగా.. 76 పరుగుల తేడాతో సఫారీ జట్టు గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
Read Also: అది ఆట.. పరుగుల బాట.. వికెట్ల వేట.. 61 పరుగుల తేడాతో పాక్ చిత్తు!

