సౌమ్య కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయం

  • కుటుంబంలో ఒక‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగం

     

  • అధికారిక లాంచ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు

     

  • ఎక్స‌యిజ్ అధికారుల‌కు ఆయుధాలు
నిజామాబాద్, క్రైం మిర్ర‌ర్ః
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య గంజాయి స్మ‌గ్ల‌ర్ల అరాచ‌కానికి ఎదురొడ్డి నిలిచి విధి నిర్వ‌హ‌ణలో ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న యావ‌త్ తెలంగాణ‌ను క‌న్నీటి ప‌ర్యంతంలో ముంచెత్తింది.
జ‌న‌వ‌రి 23న నిజామాబాద్‌లో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్‌ బృందం తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలోనే స్మగ్లర్లు తప్పించుకునే ప్రయత్నంలో తమ వాహనంతో సౌమ్యను అత్యంత కిరాతకంగా ఢీ కొట్టారు.
అంతటితో ఆగకుండా ఆమెపై నుంచి వాహనాన్ని పోనిచ్చారు. తీవ్రంగా గాయపడిన సౌమ్య చావుబతుకుల మధ్య పోరాడుతూ, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు.
రూ. కోటి ఆర్థిక సాయం…
సౌమ్య త్యాగాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆమె కుటుంబానికి అండగా నిలిచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. సౌమ్య కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం తో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించబోతున్నట్టు మంత్రి తెలిపారు.
విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భ‌రోసా ఇచ్చారు.
ఎక్స‌యిజ్ అధికారుల‌కు ఆయుధాలు…
సాధారణ పోలీసులు మాదిరిగా కాకుండా ఎక్సైజ్ అధికారులు తరచూ ఆయుధాలు లేకుండానే ప్రమాదకరమైన స్మగ్లర్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే క్షేత్రస్థాయి అధికారులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇకపై విధి నిర్వహణలో ఉన్న ఎక్సైజ్ పోలీసులకు ఆయుధాలు సమకూరుస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు.
అధికారిక లాంచ‌నాల‌తో అంత్యక్రియ‌లు…
సౌమ్య మృతదేహం ఆమె స్వగ్రామం నిజామాబాద్ జిల్లా మోస్రా చేరుగానే ఆ ప్రాంతమంతా శోకసంద్రమైంది.
తమ ఊరి బిడ్డ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వీరనారిని ఆఖరిసారి చూసేందుకు ప్రజలు తరలి వచ్చారు.
కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు ఊరంతా ఆమె పార్థివ‌ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సౌమ్య అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.
పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది భారీగా తరలి వచ్చి తమ సహచర ఉద్యోగికి ఘన నివాళి అర్పించారు. గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button