
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :-తెలంగాణ తెచ్చామని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ అంటోంది. ఈ వాదనలు అటుంచితే… తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి.. ఈ జ్వాల అప్పటి కేంద్ర ప్రభుత్వంలో యూపీఏ సర్కార్‌కు తగిలింది. దీంతో… తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే… తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయం సోనియా గాంధీ అని… రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా తరచూ అంటూ ఉంటారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం వల్లే… ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని చెప్పారు… చెప్తున్నారు కూడా. అయితే… అది నిజం కాదంటూ బాంబ్ పేల్చారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి.
తెలంగాణ ఇవ్వాలన్న ఆలోచన సోనియా గాంధీది కాదని అంటున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయం ఆమె కుమారుడు రాహుల్ గాంధీదట. ఆయన చెప్తేనే ఆనాడు యూపీఏ (UPA) చైర్‌పర్సన్‌గా ఉన్న సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారట. ఆ తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి… అమలు చేశారట. అంటే… తెలంగాణ రావడానికి కారణం సోనియా గాంధీ కాదు.. రాహుల్ గాంధీ అని చెప్తున్నారు జగ్గారెడ్డి. తెలంగాణ ఇవ్వాలన్న ఆలోచన రాహుల్ గాంధీకి రాకపోయి ఉంటే… ఇప్పటికీ తెలంగాణ వచ్చేది కాదేమో అన్నట్టు చెప్పారు జగ్గారెడ్డి. అయితే… ఇప్పటి వరకు తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు ఈ విషయం తెలియదా…! వాళ్లంతా సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందన్న భ్రమలో ఉన్నారా…!. కేసీఆర్ కూడా.. తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించింది అప్పటి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీనే అనుకున్నారు. అంటే… ఆయనకు కూడా రాహుల్ గాంధీ చెప్తేనే… సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని తెలీదా…! మరి.. జగ్గారెడ్డికి మాత్రమే ఈ నిజం ఎలా తెలిసిందో…!