
క్రైమ్ మిర్రర్, నల్లగొండ ప్రతినిధి: తన కడుపున పుట్టిన కొడుకే… వృద్ధ తల్లిదండ్రులపై కోర్టుల్లో కేసులు వేస్తూ, వాళ్లను వేధించడమే కాకుండా, వారికి మద్దతుగా నిలిచిన స్థానిక జర్నలిస్టులకూ లీగల్ నోటీసులు పంపిస్తున్న ఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది.
గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు మల్గిరెడ్డి మాధవరెడ్డి (80), సుశీలమ్మ (75) దశకాలుగా తమ కుమారుడి అరాచకాల బాధలు భరిస్తున్నారు. మాతృస్నేహం, పితృవందనం మరిచిన కొడుకు శ్రీనివాస్ రెడ్డి తన తల్లిదండ్రులను ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తుండగా, వారిని మానసికంగా, శారీరకంగా కూడా వేధిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ దుస్థితిని చూసి మానవతా దృష్టితో స్పందించిన కొంతమంది జర్నలిస్టులు, తల్లిదండ్రుల పక్షంగా నిలిచారు. వారి సమస్యను స్థానిక మీడియా ద్వారా వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ దీన్ని సహించలేని కొడుకు – తమ చర్యలపై ప్రతీకారం తీర్చుకునేందుకు జర్నలిస్టులకే ‘డిఫర్మేషన్ సూట్’ (పరువు నష్టం కేసు నోటీసులు) పంపించాడు.
ఇలాంటి సంఘటనలు మన సమాజంలో మానవ సంబంధాల పతనాన్ని ప్రతిభింబిస్తున్నాయి. వృద్ధ తల్లిదండ్రులను సంరక్షించాల్సిన బాధ్యతగల కుమారులు, స్వార్థంతో బతికే ఆలోచనలతో అలాంటి అమానుష చర్యలకు పాల్పడతారా అన్నది గమనించాల్సిన విషయం. ఈ వ్యవహారం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థులు కొడుకుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
తల్లిదండ్రుల బాధలకు మద్దతుగా…
“ఈ సంఘటన జాతీయ వృద్ధుల హక్కుల చట్టం (Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007) ఉల్లంఘనకు నిదర్శనం,” అని ఒక సామాజిక కార్యకర్త అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మనం ఏ దిశగా వెళ్తున్నామనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రుల సేవ చేయడం కర్తవ్యమని భావించకుండా, వారిని భారంగా భావించడం దారుణం. ఈ ఘటనపై అధికార యంత్రాంగం సుమోటోగా స్పందించాలని, బాధిత తల్లిదండ్రులకు న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారు.
బాధితుల పక్షాన నిలిచిన క్రైమ్ మిర్రర్ కు బెదిరింపులా.?
తల్లిదండ్రులు అలనా పాలనతో పెంచిన కొడుకు, వారినే చివరకు ఊహించని విధంగా వేధించడం మానవ సంబంధాల విలువల పతనాన్ని సూచిస్తోంది. వృద్ధ తల్లిదండ్రులు నిత్యం మనోవేదనలో బతకాల్సి వస్తున్న ఈ విషాద ఘటనకు, న్యాయం చేయాలన్న లక్ష్యంతో క్రైమ్ మిర్రర్ బాధితుల పక్షాన నిలిచింది.
క్రైమ్ మిర్రర్ అన్యాయాన్ని ప్రశ్నించడంలో ఎప్పటికీ వెనుకడుగు వేయదు. న్యాయం, మానవత్వం, హక్కుల పరిరక్షణ కోసం ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచే క్రైమ్ మిర్రర్… ఈ వ్యవహారంలో కూడా నిర్భయంగా ముందుండి పోరాడుతుంది. బెదిరింపులు, నోటీసులు, మనోవ్యాధి పద్దతులు –ఇవన్నీ మీడియా ధైర్యాన్ని తక్కువ చేయలేవు. ఎందుకంటే… నిజం పక్షాన నిలిచిన వాళ్లను చరిత్రే గౌరవిస్తుంది.
సమాజం ప్రశ్నించాల్సిన సమయం ఇది… శ్రీనివాస్ రెడ్డి వంటి వ్యక్తులు తమ వ్యక్తిగత లాభాల కోసం తల్లిదండ్రుల మనోభావాలను తుంచేస్తే, ఎక్కడ దాగి ఉంది మన సంస్కృతి? ఎక్కడ పోతుంది. మన విలువలు? తల్లిదండ్రుల మీద ప్రేమను మరిచి, వారిని భారం అన్నట్లుగా చూడటం మానవతా విపత్తు కాదు అని ఎవరైనా చెప్పగలరా? ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించడమే జర్నలిజం వారికి నా ధన్యవాదాలు. బాధితులకు అండగా నిలబడటమే లక్ష్యంగా క్రైమ్ మిర్రర్ ధైర్యంగా ముందుకు సాగుతోంది. ఎవరి బెదిరింపులు, నోటీసులు ఈ పయనాన్ని ఆపలేవు. వృద్ధుల న్యాయానికి, గౌరవ జీవనానికి ఇది ఒక సామూహిక పోరాటం.