Road Accidents on Yamuna Expressway: ఉత్తరాదిన పొగమంచు.. నిండు ప్రాణాలను హరిస్తోంది. హర్యానాలో సోమవారం ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా, సోమవారం రాత్రి, మంగళవారం వేకువజామున యూపీలో పలు ప్రాంతాల్లో ఇదే తరహా ఘటనలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఏకంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. 59 మంది గాయాల పాలయ్యారు.
వాహనాల్లో మంటలు చెలరేగి 13 మంది సజీవదహనం
మంగళవారం ఉదయం నాలుగున్నర ప్రాంతంలో యమున ఎక్స్ ప్రెస్వే మీద పొగమంచు కారణంగా.. 8 బస్సులు, 3 కార్లు ఢీకొన్నాయి. ఒక్కసారిగా మంటలు అలుముకొని వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 13 మంది మృత్యువాత పడ్డారు. 43 మంది గాయపడ్డారు. ఆగ్రా-నోయిడా మార్గంలో ఈ ప్రమాదం జరిగిందని, దట్టమైన పొగమంచు అలుముకోవటంతో, ఎదుటనున్న వాహనాలు కనిపించక ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసు అధికారులు వెల్లడించారు.
ఎక్కడ ఎంత మంది చనిపోయారంటే?
యూపీలోనే బరాబంకీ జిల్లాలో ఓ వాహనాన్ని మరో వాహనం ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో పొగమంచు కారణంగా ప్రమాదం చోటుచేసుకుందని, ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారని పోలీసులు తెలిపారు. ఉన్నావ్ జిల్లాలో ముందున్న రోడ్డు సరిగా కనిపించక ఓ వాహనం డివైడర్‌కు ఢీకొనటంతో.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాత్రి మీరట్ జిల్లాలో పొగమంచు కారణంగా ఓ వాహనం బ్రిడ్జి మీది నుంచి నదిలో పడిపోయిన ఘటనలో ఇద్దరు మరణించారు. బస్తి జిల్లాలో ఉర్సుకు వెళ్తున్న యాత్రికులతో కూడిన బస్సు, ఓ లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించగా, 11 మంది గాయపడ్డారు.
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో 14 విమానాలు రద్దు
పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ నుంచి ఢిల్లీ, ముంబై, గోవా, మధురై, పట్నా, చెన్నై, అహ్మదాబాద్‌లకు వెళ్లాల్సిన 14 విమానాలు రద్దయ్యాయి.





