
Sleep: నిద్ర అనేది మన శరీరం, మనస్సు పూర్తిగా విశ్రాంతి తీసుకునే అత్యంత కీలకమైన ప్రక్రియ. అయితే నిద్రపోయే సమయంలో గదిలో లైట్లు ఆఫ్ చేయాలా? లేక ఆన్ చేసి పడుకోవాలా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కొందరు చీకటి అంటే భయంతో లైట్లు వెలిగించి నిద్రపోతుంటే, మరికొందరు అలవాటుగా లేదా అవసరాల కారణంగా లైట్లు ఆన్‌లోనే ఉంచుతారు. ఈ అంశంపై అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన అధ్యయనం కీలక విషయాలను బయటపెట్టింది. రాత్రిపూట కృత్రిమ కాంతి మన శరీరంపై చూపే ప్రభావాలపై ఈ పరిశోధన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. నిద్ర సమయంలో గదిలో వెలుతురు ఉండటం వల్ల మెదడు పూర్తిగా విశ్రాంతి పొందలేకపోతుంది. నిద్రలో ఉన్నప్పటికీ కళ్ళపై పడే కాంతి మెదడును సక్రియం చేస్తుందని, దీని వల్ల గుండె పని తీరుపై కూడా ప్రభావం పడుతుందని తేలింది. సాధారణంగా నిద్ర సమయంలో శరీర కార్యకలాపాలు నెమ్మదిస్తాయి. కానీ వెలుతురు కారణంగా ధమనుల్లో రక్తప్రసరణ పెరిగి, గుండె వేగంగా పని చేయాల్సి వస్తుంది. దీర్ఘకాలంలో ఇది గుండె సంబంధిత సమస్యలకు, మెదడుపై ఒత్తిడికి కారణమవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, చాలా మంది లైట్లు వెలిగించి నిద్రపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చీకటి అంటే భయపడే నిక్టోఫోబియా ఉన్నవారు లైట్లు ఆఫ్ చేయలేరు. మరికొందరు రాత్రిపూట లేచే అవసరం ఉంటే దారి స్పష్టంగా కనిపించాలనే ఉద్దేశంతో లైట్ ఆన్‌లో ఉంచుతారు. ఎక్కువ ఒత్తిడి, ఆందోళనతో బాధపడే వారు కూడా చీకట్లో పడుకోలేక వెలుతురులోనే నిద్రపోతుంటారు. అలాగే కొందరికి ఇది కేవలం అలవాటుగా మారిపోయింది.
కానీ హార్వర్డ్ అధ్యయనం ప్రకారం.. ఈ అలవాటు ఆరోగ్యానికి తీవ్రంగా హానికరం. రాత్రిపూట లైట్లు వెలిగించి నిద్రపోవడం వల్ల నిద్ర నాణ్యత తగ్గడమే కాకుండా, హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గి, శరీర గడియారం అస్తవ్యస్తమవుతుంది. దీని ప్రభావం దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మానసిక ఒత్తిడిగా మారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు రాత్రిపూట పూర్తిగా చీకట్లోనే నిద్రపోవాలని, అవసరమైతే మృదువైన నైట్ లైట్‌ను కూడా నేరుగా కళ్లపై పడకుండా ఉంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ALSO READ: Viral Video: మరీ.. ఇంత దారుణమా?.. పిల్లల భోజనం మేకలపాలు చేశారు..





