
ఆస్ట్రేలియాలో స్కైడైవింగ్ ట్రైనింగ్ సమయంలో ప్రాణాంతక ప్రమాదం తప్పింది. దాదాపు 15,000 అడుగుల ఎత్తులో విమానం నుంచి దూకేందుకు సిద్ధమైన స్కైడైవర్, ఎగిరే క్షణంలోనే ఊహించని పరిస్థితులను ఎదుర్కొన్నాడు. విమానం నుంచి బయటకు రావడానికి ప్రయత్నించే సమయంలో పారాచూట్ తెరవబడటంతో అది నేరుగా విమానం తోక భాగానికి చిక్కుకుని గాల్లో ప్రమాదకరంగా వేలాడుతూ పోయాడు. సెప్టెంబర్ నెలలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా అధికారులు తాజాగా విడుదల చేయడంతో ఈ ఘటన మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రవాణా భద్రతా వాచ్‌డాగ్ చేసిన దర్యాప్తు ప్రకారం.. ఘటన జరిగిన క్షణాలు చాలా కీలకమైనవని, విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే పారాచూట్ అకస్మాత్తుగా తెరుచుకోవడం పరిస్థితిని పూర్తిగా మారుస్తుందని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తులో పారాచూట్ చిక్కుకోవడం స్కైడైవర్‌కు మాత్రమే కాదు.. విమానంలో ఉన్న పైలట్‌కు కూడా తీవ్రమైన ప్రమాదంగానే పరిగణించబడింది. ఆ క్షణాల్లో స్కైడైవర్ గాల్లో వేలాడుతూ ఉండగా పైలట్‌కి విమానంపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
విమానం తోక భాగానికి పారాచూట్ చిక్కుకోవడంతో ఆ సెగ్మెంట్ తీవ్రంగా దెబ్బతింది. పైలట్ అత్యవసర చర్యలను వెంటనే ప్రారంభించాడు. వేగాన్ని తగ్గిస్తూ విమానాన్ని స్థిరంగా ఉంచే ప్రయత్నం చేశాడు. గాల్లో వేలాడుతున్న స్కైడైవర్‌ను కాపాడటమే కాదు, దెబ్బతిన్న తోక భాగంతో విమానాన్ని సురక్షితంగా భూమిపైకి తీసుకురావడం కూడా అతిపెద్ద సవాలుగా మారింది. కొన్ని నిమిషాల పాటు ఉత్కంఠగా సాగిన ఈ పరిస్థితిని మంచి నైపుణ్యంతో ఎదుర్కొన్న పైలట్ చివరకు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంలో విజయం సాధించాడు.
ఈ ప్రమాదంలో స్కైడైవర్ ప్రాణాలతో బయటపడటం అదృష్టంగా భావిస్తున్నారు. దూకే క్షణంలోనే తీవ్రమైన ప్రమాదాన్ని చూడాల్సి వచ్చినా.. పెద్దగా ప్రాణాపాయం జరగకుండా తప్పించుకున్నాడు. అయితే ఆయన కాళ్లకు స్వల్ప గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆయన గాల్లో వేలాడుతూ ఉన్న దృశ్యాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసిన ప్రజలు స్కైడైవింగ్ భద్రత ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. విమానం టేకాఫ్ సమయంలో పారాచూట్ ముందే యాక్టివేట్ కావడం ఏవిధంగా జరిగిందో దానిపై అధికారులు మరింత సవివర దర్యాప్తు చేపట్టారు.
అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. స్కైడైవర్‌కు ప్రాథమిక శిక్షణ, భద్రతా తనిఖీలు, పరికరాల పరిశీలన వంటి అంశాలలో ఎక్కడైనా లోపం జరిగిందా అన్నదానిని కూడా పరిశీలిస్తున్నారు. స్కైడైవింగ్ మాదిరి అధిక ప్రమాదమున్న క్రీడల్లో చిన్న పొరపాటు కూడా ప్రాణానికి ముప్పు కావచ్చని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత ఆ స్కైడైవింగ్ సంస్థలో అదనపు భద్రతా చర్యలను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ALSO READ: Panchayat Elections: ఒక్క ఓటుతో గెలిచిన “అదృష్టవంతులు” వీళ్లే..





