
Nirmala Sitharaman: కేంద్రం ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన GST సంస్కరణలపై విపక్షాలు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. GSTని ప్రవేశపెట్టినప్పుడు 4 స్లాబులు ఉండాలని తీసుకున్న నిర్ణయం బీజేపీది, అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీది కాదన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారతా కమిటీ తీసుకున్న నిర్ణయమన్నారు. అందులో కాంగ్రెస్ పాలిత ఆర్థిక మంత్రులు కూడా ఉన్నారని గుర్తు చేశారు. ఆ విషయం విపక్షాలకు తెలియకపోవడం ఏంటని ఆమె ప్రశ్నించారు. తాను చెప్పినది తప్పని విపక్ష నాయకులు నిరూపిస్తే క్షమాపణ చెప్పేందుకు రెడీ అంటూ సవాల్ విసిరారు.
4 నుంచి 2కు కుదించిన GST స్లాబులు
నాలుగు టాక్స్ స్లాబ్ రేట్లపై కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు కేంద్రంపై తీవ్ర విమర్శులు కొనసాగించారు. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన GST కౌన్సిల్ రెండు టాక్స్ స్లాబ్ రేట్లకు ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త స్లాబులు అమల్లోకి రానున్నాయి. గతంలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా నాలుగు GST స్లాబ్ లు ఉండగా.. కౌన్సిల్ ఇప్పుడు 12 శాతం, 28 శాతం స్లాబ్‌లు తొలగించింది. అదే సమయంలో లగ్జరీ, సిన్ ప్రోడెక్ట్ లకు కొత్తగా 40 శాతం స్లాబ్ తీసుకువచ్చింది. ఇందులో పొగాకు ఉత్పత్తులు, కొన్ని రకాల కూల్ డ్రింక్స్ సహా హానికర వస్తువులు ఉన్నాయి.