
-
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ కలకలం
-
ఈనెల 14న వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని ఆదేశాలు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణలో కలకం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలనం బయటకు వస్తోంది. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా నేతలు, అధికారుల ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోనూ ఫోన్ ట్యాపింగ్ విషయం కలకలం రేపుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సూర్యాపేట జిల్లాలో ఆర్థికంగాను, అంగబలంలోనూ బలమైన నేతగా ఉన్న డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వట్టే జానయ్య ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తేలింది. దీంతో జానయ్యకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 14న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలియజేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇదే మొదటిది కావడం విశేషం.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో అప్పటి ప్రతిపక్ష నేతలు, అధికారుల ఫోన్ట ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తోంది. జానయ్యకు నోటీసుల జారీ చేయడంతో సాధారణ ప్రజల్లోనూ భయాందోళనలు చెలరేగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలువురు నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఫోన్లూ ట్యాప్ కావొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరింతమందికి సిట్ నోటీసులు జారీచేయొచ్చన్న అనుమానాలు వెలిబుచ్చుతున్నారు.
డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వట్టే జానయ్యను సిట్ అధికారులు విచారణకు పిలవడంతో ఆయన నుంచి మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే అప్పుడు మంత్రిగా ఉన్న జగదీశ్‌రెడ్డే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రదారి అని, సిట్ విచారణలో అన్ని విషయాలు బయట పెడతానని జానయ్య ఖరాకండిగా చెబుతున్నారు.