
గద్వాల జోగులాంబ జిల్లాలో కిరాతం జరిగింది. పెళ్లికి ముందే మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి.. పెళ్లయిన నెలకే ప్రియుడితో కలిసి భర్తను చంపించింది. తల్లీ, కూతురు ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకున్న బ్యాంకు ఉద్యోగి.. సుపారీ ఇచ్చి ప్రియురాలి భర్తను హత్య చేయించాడు.
జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్(32) ప్రైవేటు సర్వేయర్‌గా పని చేస్తున్నాడు. తేజేశ్వర్‌కు ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయం చేశారు కుటుంబసభ్యులు. అయితే పెళ్లికి ఐదు రోజులు ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, ఐశ్వర్య అతడి వద్దకే వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు. అయితే, ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగోచ్చిన ఐశ్వర్య. తేజేశ్వర్‌తో ఫోన్లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది
నువ్వంటే నాకు చాలా ఇష్టం.. అంటూ విలపించింది. దీంతో ఐశ్వర్యను నమ్మిన తేజేశ్వర్ ఆమెను పెళ్లాడేందుకు అంగీకరించాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఒప్పించి మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకోగా.. ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా నిత్యం ఫోన్లో మాట్లాడుతుండడంతో పెళ్లయిన రెండో రోజు నుంచే ఇరువురి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమవ్వగా.. అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాలింపులో భాగంగా ఏపీలోని పాణ్యం పోలీసులకు తేజేశ్వర్ మృతదేహం దొరికింది. తేజేశ్వర్ కుటుంబసభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా… ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు బయటికొచ్చాయి
ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్‌గా పని చేస్తుంది. అదే బ్యాంకుకు చెందిన సదరు ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. సదరు ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. తేజేశ్వర్‌ను పెళ్లాడిన తర్వాత ఐశ్వర్య సదరు బ్యాంకు ఉద్యోగితో 2,000 సార్లు ఫోన్ మాట్లాడినట్టు పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ అడ్డు తొలిగిస్తే అతని ఆస్తి తమ సొంతం అవుతుందని హత్యకు పథకం పన్నినట్లు సమాచారం
తేజేశ్వర్‌ను హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాక తన డ్రైవరు వారి వెంట పంపినట్టు తెలిసింది. ముందస్తు పథకం ప్రకారం.. కొంతమంది వ్యక్తులు జూన్ 17న తేజేశ్వర్ ను కలిసి. తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు.కారులోనే తేజేశ్వర్ పై కత్తులతో దాడి చేసి గొంతుకోసి చంపేసి మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని నులిపెట్టు వద్ద పారవేశారు.బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉండగా.. ఇక, ఐశ్వర్య, సుజాతను అరెస్టు చేశారు పోలీసులు.