
Shukra Pradosh Vrat: హిందూ సంప్రదాయంలో ప్రదోష వ్రతానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా శుక్రవారం నాడు వచ్చే ప్రదోషాన్ని శుక్ర ప్రదోషం అని పిలుస్తారు. పరమశివుడి అనుగ్రహాన్ని పొందేందుకు ఇది అత్యంత శుభప్రదమైన వ్రతంగా భావిస్తారు. శివుని ఆరాధనతో పాటు ఐశ్వర్యానికి అధిపతిగా భావించే శుక్ర గ్రహ ప్రభావం కూడా ఈ వ్రతంతో అనుసంధానమై ఉంటుంది. అందుకే శుక్ర ప్రదోష వ్రతం ఆచరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, జీవితంలో సుఖసంతోషాలు, సంపద, ప్రశాంతత లభిస్తాయని భక్తుల విశ్వాసం.
శుక్ర ప్రదోష వ్రతం 2026 సంవత్సరంలో జనవరి 16వ తేదీ శుక్రవారం నాడు నిర్వహించనున్నారు. ఈ వ్రతానికి సంబంధించిన త్రయోదశి తిథి జనవరి 15వ తేదీ రాత్రి 8 గంటల 16 నిమిషాలకు ప్రారంభమై, జనవరి 16వ తేదీ రాత్రి 10 గంటల 21 నిమిషాల వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రదోష పూజకు అత్యంత అనుకూలమైన సమయం సాయంత్రం 5 గంటల 47 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 29 నిమిషాల వరకు ఉంటుందని పంచాంగాలు సూచిస్తున్నాయి. ఈ సమయంలో శివారాధన చేయడం అత్యంత ఫలప్రదంగా భావిస్తారు.
శుక్ర ప్రదోష వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించడం వల్ల జాతకంలో శుక్ర గ్రహం బలపడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతారు. శుక్ర గ్రహం బలంగా ఉండటం వల్ల విలాసవంతమైన జీవితం, ధనలాభం, కళాత్మక ప్రతిభ, సౌందర్యం మరియు కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయని నమ్మకం. ముఖ్యంగా వివాహ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు, భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడాలని కోరుకునే వారు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలని పండితులు సూచిస్తారు.
శివుని అనుగ్రహంతో మానసిక ఆందోళనలు, భయాలు, అస్థిరత తొలగిపోతాయని భక్తుల అనుభవం. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడులు తగ్గి, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అంతేకాదు శారీరక వ్యాధుల నుంచి ఉపశమనం లభించి, ఆరోగ్యం మెరుగుపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శుక్ర గ్రహ దోషాలతో బాధపడే వారికి ఈ వ్రతం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని విశ్వసిస్తారు.
పూజా విధానం విషయానికి వస్తే.. శుక్ర ప్రదోష వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానమాచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి. రోజంతా ఉపవాసం ఉండడం లేదా ఫలాహారం తీసుకోవడం శ్రేయస్కరం. వీలైనంత వరకు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపిస్తూ శివధ్యానంలో గడపాలి. ఉదయం శివుడు, పార్వతీ దేవిని పూజించి నెయ్యితో దీపం వెలిగించి, పండ్లు, పూలు, మిఠాయిలు సమర్పించాలి.
ప్రదోష వ్రతంలో ప్రధాన పూజ సాయంత్రం వేళ నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి ముందు లేదా ఆ సమయంలో మరోసారి స్నానం చేసి లేదా చేతులు కాళ్లు శుభ్రంగా కడుక్కొని పూజకు సిద్ధమవ్వాలి. శివలింగానికి గంగాజలం, పాలు, పెరుగుతో అభిషేకం చేయాలి. అనంతరం బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, అక్షింతలను శివునికి సమర్పించాలి. ఇవి శివునికి అత్యంత ప్రీతికరమైనవిగా శాస్త్రాలు పేర్కొంటాయి.
పూజ అనంతరం ప్రదోష వ్రత కథను చదవడం లేదా వినడం చాలా ముఖ్యమని పెద్దలు చెబుతారు. చివరగా కర్పూర హారతితో శివుని ఆరాధన ముగించి, భక్తిశ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా సంపూర్ణంగా శుక్ర ప్రదోష వ్రతాన్ని ఆచరించిన వారికి శివకృపతో పాటు శుక్ర గ్రహ అనుగ్రహం లభించి, జీవితం సాఫీగా సాగుతుందని భక్తుల నమ్మకం.





