
వైసీపీ నేతల్లో అంతర్మథనం మొదలైందా..? అధినేత ఏది చెప్తే అదే రైట్.. గీత దాటం… అధ్యక్షుడి నిర్ణయాలను స్వాగతిస్తామన్న నేతలు.. ఇప్పుడు తప్పులు లెక్కబెడుతున్నారా..? వైసీపీ ఓటమికి అధినేతను బాధ్యుడిని చేస్తున్నారా..? ఆయన నిర్ణయాలే కొంపముంచాయని బాధపడుతున్నారా..? అంటే అవుననే అనిపిస్తోంది. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు, వాలంటీర్ వ్యవస్థ వల్లే నష్టపోయామని ఇంకొందరు అన్నారు. ఇప్పుడు బీజేపీని వదిలి తప్పుచేశామన్న విమర్శ వినిపిస్తోంది. అంటే.. జగన్ తీసుకున్న నిర్ణయాలే ఓటమికి కారణమని… నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేస్తారు నేతలు. ఒక్కొక్క తప్పును బయటపెడుతున్నారు.
వైనాట్ 175 అంటూ 2024 ఎన్నికలకు ధీమాగా వెళ్లింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ.. ఏపీ ప్రజలు మాత్రం గట్టి దెబ్బ కొట్టారు. 11 సీట్లకే పరిమితం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత.. చాలా మంది వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. కానీ.. ఈ మధ్యనే ఒక్కొక్కరూ నోరు తెరుస్తున్నారు. ఓటమికి కారణమాలు ఇవే అంటూ.. ప్రజలకు, కార్యకర్తలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడితో ఆగినా పర్లేదు.. ఏకంగా పార్టీ అధ్యక్షుడిదే తప్పు అంటూ ఒక్కొక్కరు పల్లవి అందుకుంటున్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత… ఓటమికి కారణాలను విశ్లేషించుంది వైసీపీ. పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ న్యాయం చేయాలన్న తపనతో కార్యకర్తలకు అన్యాయం చేశామని.. గుర్తించారు. దాన్ని జగన్ కూడా అంగీకరించారు. జగన్ 2.0 వేరుగా ఉంటుందని.. కార్యకర్తలకు ఎలా అండగా ఉంటానో చూపిస్తానన్నారు. సరే అది అయిపోంది. ఆ తర్వాత… వాలంటీర్ వ్యవస్థ వల్లే ఓడిపోయామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో పాటు కొందరు నేతలు చెప్పారు. వాలంటీర్ వ్యవస్థను తెచ్చింది జగన్… అధికారంలో ఉన్నన్ని రోజులు.. ఆ నిర్ణయంపై నేతలు ఎవరూ కిక్కురుమనలేదు. పార్టీ ఓడిపోగానే… వాలంటీర్ వ్యవస్థ వల్లే నష్టం జరిగిందని అంటున్నారు. అంటే.. ఈ వ్యవస్థ తెచ్చిన అధినేతనే తప్పని చెప్పకనే చెప్పినట్టుంది వారి తీరు.
ఇప్పుడు తాజా… ఇంకో వాదన తెరమీదరకు వచ్చింది. ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే.. గెలిచివాళ్లమని వైసీపీ నేత, నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి అంటున్నారు. బీజేపీని వదిలేసి తప్పుచేశామని… ఈసారి ఎన్నికల్లో ఆ తప్పు జరగదని అన్నారు. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని చెప్పారు ప్రసన్నకుమార్‌రెడ్డి. అంటే.. బీజేపీతో కలిసేందుకు అంటే ఎన్నికల ముందు వైసీపీ-బీజేపీ కలిసి పోటీచేయాలన్న ప్రతిపాదన వచ్చిందా..? ఆ ప్రతిపాదనను వైఎస్ జగన్ అంగీకరించలేదా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా… ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యలు కూడా అధినేత వైఎస్ జగన్‌ను ప్రశ్నిస్తున్నట్టే ఉంది.