
Shocking Video: జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతోంది. గుంపు నుంచి వేరుపడిన ఓ మగ ఏనుగు పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ ఏనుగు దాడుల్లో సుమారు 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామాలపై దాడులు, పొలాల్లోకి చొరబడటం, ఇళ్లను ధ్వంసం చేయడం వంటి ఘటనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
A killer elephant — who is at-large — has left a total of 22 people dead over a 10 day period in India.
Details: https://t.co/Q3njFcHsgJ
🎥: TIM pic.twitter.com/NzXY48gI4d
— TMZ (@TMZ) January 19, 2026
ఈ ఏనుగు రోజుకు సగటున 30 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూ గ్రామాల మధ్య సంచరిస్తుండటం అటవీశాఖకు సవాలుగా మారింది. సాధారణంగా గుంపుగా ఉండే ఏనుగులు ఒంటరిగా మారినప్పుడు హింసాత్మకంగా ప్రవర్తించే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జార్ఖండ్ ప్రభుత్వం పరిస్థితిని అత్యంత సీరియస్‌గా తీసుకుని ఎమర్జెన్సీ ప్రకటించింది.
ఏనుగును అదుపులోకి తీసుకునేందుకు అటవీశాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. సుమారు 100 మంది అటవీ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు మూడు సార్లు మత్తు మందు ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఏనుగును పూర్తిగా నియంత్రించలేకపోయారు. దట్టమైన అడవులు, వేగంగా కదలికలు, అప్రమత్తత ఈ ప్రయత్నాలకు అడ్డంకిగా మారుతున్నాయి.
అటవీ అధికారులు ఈ ఏనుగు మదంతో ప్రవర్తిస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మగ ఏనుగుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు అధికంగా పెరిగిన సమయంలో అవి అత్యంత హింసాత్మకంగా మారతాయని తెలిపారు. ఫారెస్ట్ ఆఫీసర్ కుల్దీప్ మీనా మాట్లాడుతూ.. ఇంతకు ముందు ఈ స్థాయిలో ఓ మగ ఏనుగు బీభత్సం సృష్టించిన ఘటనలు చాలా అరుదని పేర్కొన్నారు.
ప్రజల భద్రత దృష్ట్యా ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో గ్రామాలను ఖాళీ చేయిస్తూ, రాత్రివేళ ప్రజలు బయటకు రాకుండా హెచ్చరికలు జారీ చేశారు. అటవీ శాఖ, పోలీస్ శాఖలు సమన్వయంతో పరిస్థితిని నియంత్రించేందుకు నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఏనుగును సురక్షితంగా పట్టుకొని అడవుల్లోకి తరలించే వరకు అప్రమత్తత కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
ALSO READ: మేడారంలో పెంపుడు కుక్కకు తులాభారం.. క్షమాపణలు చెప్పిన నటి (VIDEO)





