
Shocking facts: మానవ జీవితంలో గాలి, నీరు, ఆహారం వంటి మౌలిక అవసరాల వలె పెళ్లి కూడా ఒక ముఖ్యమైన భాగం. అయితే అందరూ తప్పనిసరిగా వివాహం చేసుకోవాలనే నియమం లేదు. వ్యక్తి ఇష్టానికి, పరిస్థితులకు తగిన నిర్ణయమే ప్రధానము. అయినప్పటికీ, పెళ్లి వ్యక్తి జీవితకాలంపై, ఆరోగ్యంపై చూపే ప్రభావం విషయంలో శాస్త్రవేత్తలు కొన్ని కీలకమైన అంశాలను వెలుగులోకి తెచ్చారు. తాజా పరిశోధనల ప్రకారం వివాహం చేసుకున్న వారితో పోలిస్తే జీవితాంతం ఒంటరిగా ఉండేవారిలో ముందుగానే మరణించే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా కనిపిస్తోంది.
కలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన రాబర్ట్ కప్లాన్, రిచర్డ్ క్రోనిక్ నేతృత్వంలో జరిగిన సమగ్ర అధ్యయనంలో పెళ్లి చేసుకున్న వ్యక్తులతో పోలిస్తే పెళ్లి చేసుకోని వారిలో డెత్ రిస్క్ 8.77 శాతం అధికంగా ఉందని నిర్ధారించారు. కొన్ని వయస్సు గుంపుల్లో ఈ ప్రమాదం 58 శాతం వరకు పెరగడం పరిశోధకులను మరింత ఆలోచింపజేసింది. ముఖ్యంగా చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా ఉండే వ్యక్తులకే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వంటి అలవాట్లు ఉన్నప్పటికీ అన్‌మ్యారీడ్ వ్యక్తుల్లో డెత్ రిస్క్ తగ్గలేదని డేటా తెలిపింది.
అధ్యయనంలో భాగంగా 1989 నాటి నేషనల్ హెల్త్ ఇంటర్వ్యూ సర్వేలో పాల్గొన్న 67 వేల మందికి పైగా అమెరికన్ల సమాచారాన్ని, 1997 డెత్ ఇండెక్స్ డేటాతో అనుసంధానం చేసి విశ్లేషించారు. వయస్సువారీగా పరిశీలించినప్పుడు 44 ఏళ్ల లోపు అన్‌మ్యారీడ్ వ్యక్తుల్లో యాక్సిడెంట్లు, కొన్ని అనారోగ్యాలు, హెచ్‌ఐవి వంటి కారణాలతో మరణాలు 2.12 రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. పెళ్లి వల్ల లభించే భావోద్వేగ మద్దతు, కుటుంబ అనుబంధం, సామాజిక బంధాలు, మానసిక స్థిరత్వం వంటి అంశాలు అందకపోవడం వల్ల ఒంటరితనం, ఆందోళన, డిప్రెషన్ పెరిగి, ఇవి శరీరంలో రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయని పరిశోధకులు వివరించారు. ఈ ప్రభావం పురుషుల్లో మహిళల కంటే ఎక్కువగా ఉండడం కూడా ముఖ్యమైన అంశంగా గుర్తించారు.
ఇలాంటి ధోరణి భారతదేశంలో కూడా కనిపిస్తోంది. 2022లో ప్రచురితమైన SAGE స్టడీ ప్రకారం.. పెళ్లి చేసుకున్నవారితో పోలిస్తే ఒంటరిగా ఉన్నవారిలో, లేదా విడిపోయినవారిలో డెత్ రిస్క్ 20 నుంచి 30 శాతం వరకు అధికంగా ఉంది. 2016లో జరిగిన మరో పరిశోధన 60 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న సీనియర్ సిటిజన్లతో పోలిస్తే పెళ్లి కాని వ్యక్తుల్లో షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు 15 నుంచి 25 శాతం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. మానసిక ఒత్తిడి, సామాజిక మద్దతు లేకపోవడం, ఆర్థిక భారం వంటి అంశాలు దీనికి ముఖ్య కారణాలుగా పేర్కొనబడ్డాయి.
ALSO READ: OLX: రూ.20 వేలకు ఎమ్మార్వో ఆఫీస్ అమ్మకం..!





