
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావొస్తోంది. అయినా… చాలా మంది జగన్ నామస్మరణ చేస్తున్నారు. ఆఫీసుల్లో జగన్ ఫొటో పెట్టుకున్నారు. ఎందుకలా..? ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది…? కూటమి ప్రభుత్వం వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందా…? మళ్లీ జగన్ ప్రభుత్వం రావాలని అనుకుంటున్నారా…? అదేమీ కాదండి. అసలు ఏం జరిగిదంటే…?
ఏపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం గడిచిపోతోంది. అయినా… కొన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో జగన్ ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే… రాష్ట్ర అధికారం కూటమి చేతుల్లో ఉన్నా…. స్థానిక సంస్థలు మాత్రం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా పరిషత్‌లు వైసీపీవే. దీంతో… జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ఇప్పటికీ వైఎస్ జగన్ ఫొటోలు కనిపిస్తున్నాయి. జిల్లా పరిషత్ అధ్యక్షుడు వైసీపీ నేతలు కావడంతో… పార్టీ అధ్యక్షుడి ఫొటోలను ఆఫీసుల్లో ఉంచుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలు మాత్రం స్టోర్ రూమ్ పక్క తగిలించారు.
అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఈ పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లా పరిషత్ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లారు. అక్కడ ఆఫీసులో జగన్ ఫొటోలు కనిపించడంతో అవాక్కయ్యారు. అంతేకాదు… ఎక్కడో స్టోర్ రూమ్ పక్కన సీఎం చంద్రబాబు ఉండటం కనిపించింది. దీంతో.. జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మను నిలదీశారు టీడీపీ ఎమ్మెల్యేలు. సీఎం చంద్రబాబు ఫొటోలు పెట్టాలన్న ప్రొటోకాల్ ఎందుకు పాటించడంలేదని ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ ఫొటోలు.. చైర్‌పర్సన్ ఛాంబర్‌లో పెట్టుకుని.. సీఎం చంద్రబాబు ఫొటోలను స్టోర్ రూమ్ పక్కన పెడతారా అంటూ గట్టిగా నిలదీశారు. వెంటనే జగన్ ఫొటోలు తీయించి… ఆ స్థానంలో సీఎం చంద్రబాబు పొటోలను తగిలించారు టీడీపీ ఎమ్మెల్యేలు.
అనంతపురం ఒక్కటే కాదు… వైసీపీ చేతిలో ఉన్న స్థానికసంస్థలు అన్నింటిలో ఇదే పరిస్థితి ఉంది. ఇటీవల కర్నూలు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. విజయ డెయిరీ ఆఫీసులోని చైర్మన్ ఛాంబర్‌లో కూడా జగన్ ఫొటో, ఆయన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫొటోలు మాత్రమే కనిపించాయి. ఎక్కడ చంద్రబాబు ఫొటో లేదు. వైసీపీ అధికారం ఉన్న స్థానిక సంస్థల్లో ఇలాంటి పరిస్థితే ఉండటంతో.. కూటమి ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా ఆఫీసులకు వెళ్లినప్పుడు జగన్ ఫొటోలను తీయిస్తున్నారు.