
Shah On Sudarshan Reddy: ఇండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మావోయిస్టు మద్దతుదారు అంటూ ఆరోపణలు చేశారు. చత్తీస్ గఢ్ లో నక్సలైట్లపై పోరాటానికి ముందుకొచ్చిన సల్వాజుడుంను నిషేధిస్తూ ఆయన ఇచ్చిన తీర్పే దీనికి నిదర్శమన్నారు. సల్వాజుడుంను నిషేధించకపోతే దేశంలో నక్సలిజం 2020 నాటికే పూర్తిగా అంతరించేదన్నారు. నక్సలిజానికి మద్దతివ్వటానికి ఆయన సుప్రీంకోర్టు వంటి అత్యున్నత సంస్థను ఉపయోగించుకున్నారని ఆరోపించారు. వామపక్షాల ఒత్తిడితోనే కాంగ్రెస్ పార్టీ సుదర్శన్‌రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిందని విమర్శించారు.
పదవులను తొలగించే చట్టం గురించి..
జైలుపాలైన ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవుల నుంచి తొలగించేందుకు ఉద్దేశించి తాజాగా తీసుకొచ్చిన మూడు బిల్లులను అమిత్ షా ప్రస్తావించారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ గతంలో జైలులో ఉన్నప్పటికీ సీఎం పదవికి రాజీనామా చేయని విషయాన్ని గుర్తు చేశారు. జైలు నుంచే ఒక సీఎం ప్రభుత్వాన్ని నడిపించారు. అటువంటప్పుడు, ఈ బిల్లులు తీసుకురావాలా? వద్దా? అని ప్రశ్నించారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తి
వచ్చే నెల 9న జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్షాల అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి పరస్పరం తలపడబోతున్నారు. వీరిద్దరు సమర్పించిన 4 సెట్ల నామినేషన్ పత్రాలు సవ్యంగా ఉన్నాయని పరిశీలన అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు బీజేపీకి చెందిన సీపీ రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్నారు. తెలంగాణకు చెందిన బి.సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. సంఖ్యాబలం పరంగా ఎన్డీయే అభ్యర్థి విజయం సునాయాసం కానుంది.