
Sexual Health: అధిక రక్తపోటు అనేది కేవలం గుండె, కిడ్నీలు లేదా మెదడుపై మాత్రమే ప్రభావం చూపే సమస్య కాదని, ఇది పురుషులు మరియు మహిళల లైంగిక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హైబీపీ కారణంగా శరీరంలోని రక్తనాళాల లోపలి పొర అయిన ఎండోథెలియం దెబ్బతింటుంది. ఈ ఎండోథెలియం రక్తప్రసరణను నియంత్రించే కీలక పాత్ర పోషిస్తుంది. ఇది దెబ్బతినడంతో రక్తనాళాలు అవసరమైనంతగా విస్తరించలేవు. ఫలితంగా ముఖ్యమైన అవయవాలకు సరైన రక్తప్రవాహం చేరక ఇబ్బందులు ఏర్పడతాయి.
పురుషుల విషయంలో అధిక రక్తపోటు నేరుగా అంగస్తంభన సమస్యకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. పురుషాంగానికి సరిపడా రక్తప్రవాహం లేకపోవడం వల్ల అంగస్తంభన సక్రమంగా జరగదు. దీని ప్రభావంతో లైంగిక జీవితంలో అసంతృప్తి, ఆత్మవిశ్వాస లోపం వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. చాలా మంది పురుషులు ఈ సమస్యను బయట చెప్పడానికి సంకోచిస్తుంటారు కానీ.. దీని వెనుక హైబీపీ వంటి ఆరోగ్య సమస్యలు దాగి ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మహిళల్లో కూడా అధిక రక్తపోటు లైంగిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. హైబీపీ కారణంగా యోని ప్రాంతానికి వెళ్లే రక్తప్రవాహం తగ్గిపోతుంది. దీని వల్ల లైంగిక ప్రేరణ తగ్గడం, సహజ తేమ లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవి మహిళల్లో లైంగిక ఆసక్తి తగ్గడానికి కారణమవుతాయి. దీర్ఘకాలంగా ఈ సమస్య కొనసాగితే దాంపత్య జీవితంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
అందువల్ల అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయకుండా, సమయానికి గుర్తించి నియంత్రించుకోవడం చాలా అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల ఆహారం, నిత్య వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ, వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడటం ద్వారా హైబీపీని అదుపులో ఉంచుకోవచ్చని వారు చెబుతున్నారు. రక్తపోటు నియంత్రణలో ఉంటే గుండె ఆరోగ్యంతో పాటు లైంగిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ALSO READ: VIDEO: మరీ ఇంత కరువా? అర్ధరాత్రి అమ్మాయిల హాస్టళ్లోకి చొరబడి..





