
Sexual Assault: తమిళనాడులో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. తూత్తుకూడి జిల్లా పరిధిలో జరిగిన ఈ అమానుష ఘటన యావత్ సమాజాన్ని తలదించుకునేలా చేసింది. భర్త కళ్లముందే భార్యపై లైంగిక దాడికి పాల్పడటం మానవత్వాన్ని ప్రశ్నించే స్థాయిలో కలకలం రేపింది. మహిళల భద్రతపై మరోసారి తీవ్రమైన ఆందోళనను ఈ సంఘటన కలిగించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూత్తుకూడి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు ఇటుకల బట్టిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పనులు ముగించుకుని భార్యాభర్తలు కలిసి ఇంటివైపు వెళ్తుండగా కొందరు యువకులు వారిని గమనించి దారిని అడ్డగించారు. ఒక్కసారిగా భర్తను దూరంగా తోసివేసి, భార్యపై అత్యాచారానికి ప్రయత్నించారు.
ఈ సమయంలో భర్త భార్యను కాపాడేందుకు ప్రతిఘటించగా, దుండగులు అతనిపై విచక్షణ రహితంగా దాడి చేసి అటవీ ప్రాంతానికి లాక్కెళ్లారు. అనంతరం మహిళపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితులు పోలీసులకు వివరించారు. ఈ ఘటనతో దంపతులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
సంఘటన అనంతరం బాధిత దంపతులు సమీప పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
ALSO READ: రాత్రిపూట ట్రైన్‌లో ప్రయాణిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి





