Homeఆంధ్ర ప్రదేశ్సెల్ఫీ స‌ర‌దా ముగ్గురి ప్రాణాలు తీసింది...అనంత‌గిరిలో విషాదం...!

సెల్ఫీ స‌ర‌దా ముగ్గురి ప్రాణాలు తీసింది…అనంత‌గిరిలో విషాదం…!

అనంత‌గిరి, క్రైమ్ మిర్ర‌ర్: సెల్ఫీ స‌ర‌దా ముగ్గురు మృతి చెందిన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో గురువారం సాయంత్రం సెల్ఫీ దిగుతు జ‌లాపాతంలో ప‌డి మృతి చెందిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.మృతులందరూ హుకుంపేట మండలం జుంబువలసకు చెందినవారుగా గుర్తించారు. పోలీసులు, స్థాని కులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం జుంబువలస గ్రామానికి చెందిన కొందరు విద్యార్థినులు, ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో సెలవులు ఎంజాయ్ చేయడానికి అనంతగిరి మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మూలగుమ్మి జలపాతాన్ని సందర్శించడానికి వెళ్లారు. జలపాతం వద్ద ఉన్న ప్రకృతి అందాలను చూసి ముగ్ధులైన నలుగురు విద్యార్థినులు, జలపాతం పైభాగంలో నిలబడి మొబైల్ ఫోన్‌తో సెల్ఫీ దిగాలని అనుకున్నారు.

సెల్ఫీ దిగుతున్న సమయంలో, ఒక్కసారిగా ఒక బాలిక కాలు జారడంతో, ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించిన మిగతా ముగ్గురు కూడా జలపాతంలో లోతైన నీటిలో పడిపోయారు. పై నుంచి కిందపడిన వేగానికి ముగ్గురు బాలికలు రాళ్లకు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నీటిలో మునిగిపోతున్న నాలుగో బాలికను గమనించిన స్థానికులు, ఇతర పర్యాటకులు వెంటనే స్పందిించి, తీవ్ర శ్రమకోర్చి ఆమెను బయటకు తీశారు.

సమాచారం అందుకున్న వెంటనే అనంతగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన ముగ్గురు విద్యార్థినుల మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం కోసం తరలించారు. మృతులు పడాల్ జ్యోతి (17), గసి సన్యాసమ్మ (17),
కంప సీత (17) గుర్తించారు. తీవ్రంగా గాయపడిన బాలిక కొండ్ల అనూష (16) ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వీరందరూ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇటీవలే పరీక్షలు పూర్తి చేసుకుని, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

గ్రామంలో విషాద ఛాయలు…

ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువతులు, అదీ ఇంటర్ చదువుతున్న విద్యార్థినులు అకస్మాత్తుగా మరణించడంతో జుంబువలస గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ పిల్లలు ఇక లేరని తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సరదాగా గడపడానికి వెళ్లిన వారు ఇలా శవాలై తిరిగి వస్తారని ఊహించలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదకరమైన ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోవద్దని పోలీసులు పర్యాటకులకు విజ్ఞప్తి చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు