
బెల్లంపల్లి,క్రైమ్ మిర్రర్:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయిపూలే దంపతుల విశిష్ట సేవలను స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన సావిత్రి జ్యోతిబాపూలే విగ్రహాన్ని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, భారత సమాజంలో విద్యా విప్లవానికి నాంది పలికిన మహనీయులు జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. మహిళల విద్య, దళితుల హక్కులు, సామాజిక సమానత్వం కోసం వారు చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. వారి ఆలోచనలు, ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం, విద్యా అభివృద్ధి లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఎంపీ అభిప్రాయపడ్డారు. అలాగే కన్నెపల్లి ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
Read also : రైతులకు యూరియా సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవు : శ్రీనివాస్ గౌడ్
ఇదే సందర్భంలో మాలే కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చే అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో మాలే కులం బీసీ–డీ జాబితాలో ఉండటంవల్ల ఉద్యోగాలు, రిజర్వేషన్లలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో మాలే కులం ఇప్పటికే ఎస్టీ జాబితాలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ, తెలంగాణలోనూ అదే తరహాలో న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ , డిసిసి ప్రెసిడెంట్ పిన్నింటికి రఘునాథరెడ్డి, స్థానిక నాయకులు,మండల నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
Read also : క్రికెట్ అభిమానుల డిమాండ్ మేరకు ఆ ప్లేయర్ ను తొలగించాలి అని బీసీసీఐ ఆదేశాలు?





