తెలంగాణ

డిసెంబర్‌లో సర్పంచ్ ఎన్నికలు.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్

తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు గత 10 నెలలుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. పంచాయితీ పాలకమండళ్ల గడువు ఈ ఏడాది జనవరిలో ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికల తేదీలు వాయిదా పడుతూ వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే కులగణన చేయాలి. దీంతో పంచాయితీ ఎన్నికలను కాంగ్రెస్ సర్కార్ ఆలస్యం చేస్తూ వచ్చింది. తాజాగా సర్పంచ్ ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. డిసెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈనెల 6 నుంచి కులగణన చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. కులగణన పూర్తి కాగానే రిజర్వేషన్లు పెంచి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆ దిశగానే మంత్రి పొంగులేటి ప్రకటన చేశారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంను తీసుకుందని..ఈనెల నవంబర్ 6, 7 నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం గ్రామ సభలు నిర్వహిస్తామని చెప్పారు. రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిధుల కోసం ప్రభుత్వం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తుందన్నారు. మొదట పేదవారికి ప్రాధాన్యత ఇండ్ల స్థలం ఉండి ఉన్న వారికి 5 లక్షల నిర్మాణ ఆర్థిక సహాయం చేస్తామని పొంగులేటి చెప్పారు.ఇండ్ల స్థలాలు లేని నిరు పేదలకు 75 నుంచి 80 గజాల స్థలం ప్రభుత్వం ఇవ్వాలని ఆలోచన చేస్తోందన్నారు. 4000 sft కి తక్కువ కాకుండా ఇండ్ల నిర్మాణం చేయాల్సిందే అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఓ యాప్ ను అందుబాటులోకి తీసుకు వస్తుందన్నారు పొంగులేటి. 360 డిగ్రీల్లో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆధార్ కార్డు తప్పని సరి అన్నారు. త్వరలో రేషన్ కార్డుల స్థానాల్లో స్మార్ట్ కార్డ్ ఇస్తామన్నారు. నాలుగు దఫాలుగా ఇండ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వంలోని 16 శాఖలకు సంబంధించిన ఉద్యోగులను ఇందిరమ్మ ఇండ్ల మానిటరింగ్ కు కేటాయిస్తామని పొంగులేటి వెల్లడించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని..వాళ్ళు పెట్టె అన్ని షరతులకు తాము ఒప్పుకుంటామన్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్లను కూడా తామే పూర్తి చేస్తామన్నారు పొంగులేటి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button