
రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:-మందమర్రి ఏరియా ఆర్‌కే–1ఏ అటవీ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో పులకించిపోయింది. సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్న సమ్మక్క–సారలమ్మ జాతర బుధ, గురువారాల్లో కీలక ఘట్టాలకు చేరుకుంది. సింగరేణి కార్మికులు, పరిసర గ్రామాల ప్రజల జయజయధ్వానాల మధ్య వనదేవతలు గద్దెలపైకి కొలువుదీరారు. జాతరలో భాగంగా బుధవారం సాయంత్రం సారలమ్మను, గురువారం సమ్మక్క తల్లిని అత్యంత వైభవంగా గద్దెలపైకి తీసుకువచ్చారు. డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, భక్తుల కొబ్బరికాయల నైవేద్యాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఇద్దరు వనదేవతలు గద్దెలపైకి చేరడంతో జాతరలో అసలైన ఉత్సాహం నెలకొంది.పోటెత్తిన భక్తజనం మందమర్రి, రామకృష్ణాపూర్ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవార్ల దర్శనానికి తెల్లవారుజాము నుంచే కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి చూశారు. అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బెల్లంపల్లి ఏసిపి ఆద్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో క్యూలైన్లను క్రమబద్ధీకరించారు. అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఈ జాతర స్థానికులకు మేడారం జాతరను తలపించేలా సాగుతోంది.
Read also : లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు : డిఎంహెచ్ఓ రవికుమార్
Read also : ఇన్‌స్టా పరిచయంతో మహిళ ఎఫైర్.. ప్రైవేట్ ఫొటోలతో వేధింపులు!





