
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల రద్దీ గరిష్ఠ స్థాయికి చేరింది. సొంతూళ్లకు వెళ్లేందుకు హైదరాబాద్ వాసులు భారీగా బయలుదేరడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా మహాత్మా గాంధీ బస్టాండ్ (MGBS), జూబ్లీ బస్టాండ్ (JBS)ల్లో ప్రయాణికులతో విపరీత రద్దీ నెలకొంది.బస్టాండ్‌కు వచ్చిన క్షణాల్లోనే బస్సులు నిండిపోతుండటంతో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. జేబీఎస్‌తో పాటు ఉప్పల్ క్రాస్‌రోడ్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో కూడా ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది.
Read also : భర్త ధోతీ–కుర్తా ధరిస్తున్నాడని విడాకులు కోరిన భార్య
పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొత్తం 6,431 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మరోవైపు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తీవ్రంగా ఉంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరగా, ఏపీ, తెలంగాణ సరిహద్దులోని చిల్లకల్లు సమీపంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అటు విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలోనూ ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 600 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అలాగే పండుగ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
సంక్రాంతి పండుగ ముగిసే వరకు ప్రయాణికుల రద్దీ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికులు ముందస్తు ప్రణాళికతో ప్రయాణాలు చేయాలని, అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read also : విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ





