
హిందువులు అత్యంత భక్తి భావంతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే ప్రధాన పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. ఈ పండుగకు కేవలం ఆచారపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు.. ఖగోళ శాస్త్రంతో కూడిన విశిష్టత కూడా ఉంది. సూర్యుడు ధనుస్సు రాశిని విడిచిపెట్టి మకర రాశిలోకి ప్రవేశించే ఘట్టమే మకర సంక్రాంతిగా పరిగణిస్తారు. ఈ మార్పుతో ఉత్తరాయణం ప్రారంభమవుతుందని, చలి తీవ్రత క్రమంగా తగ్గి ప్రకృతి కొత్త చైతన్యాన్ని సంతరించుకుంటుందని నమ్మకం.
సాధారణ పండుగల మాదిరిగా మకర సంక్రాంతి తిథుల ఆధారంగా నిర్ణయించబడదు. పూర్తిగా సూర్యుడి గమనంపై, రాశిచక్ర మార్పుపై ఆధారపడి ఈ పండుగ తేదీ నిర్ణయిస్తారు. 2026 సంవత్సరంలో సూర్యుడు జనవరి 14న మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషాలకు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. అందువల్ల ప్రధానంగా జనవరి 15న మకర సంక్రాంతిని జరుపుకోనున్నట్లు పండితులు చెబుతున్నారు. అయితే కొన్ని పంచాంగాల ప్రకారం జనవరి 14న కూడా సంక్రాంతి ఆచరణలో ఉంటుందని పేర్కొంటున్నారు.
మకర సంక్రాంతి రోజున ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయడం శుభప్రదమని విశ్వసిస్తారు. నదీ స్నానం సాధ్యం కానివారు ఇంట్లో గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని భావిస్తారు. అనంతరం సూర్యనారాయణుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా శక్తి, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని నమ్మకం.
ఈ పండుగలో నువ్వులు, బెల్లంతో చేసిన వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంది. నువ్వులు బెల్లం తినడం వల్ల సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుందని, శరీరానికి ఉష్ణం కలిగి ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పెద్దల మాట. అలాగే ఈ రోజున నిరుపేదలకు దానధర్మాలు చేయడం అత్యంత శ్రేష్ఠమని చెబుతారు. ధాన్యాలు, బట్టలు, దుప్పట్లు, ఆహారం దానం చేయడం ద్వారా పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం.
మకర సంక్రాంతి రోజున ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం, ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో ముఖ్యమని భావిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరగడానికి ఇది మంచి అవకాశం. ఈ సందర్భంగా కిచిడీ, నువ్వుల లడ్డూలు, పిండి వంటకాలు తయారు చేసి ఆనందంగా పంచుకుంటారు.
ఈ పండుగ రోజున తగాదాలు, నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలని ఆధ్యాత్మిక పెద్దలు సూచిస్తారు. ఈ రోజు మన ఆలోచనలు, మాటలు ఏడాది పొడవునా ప్రభావం చూపుతాయని నమ్మకం. అందుకే చాలా మంది ఈ రోజున కొత్త అలవాట్లు ప్రారంభించడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం చేస్తుంటారు.
మొత్తంగా చెప్పాలంటే మకర సంక్రాంతి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ప్రకృతితో మనిషి అనుబంధాన్ని గుర్తు చేసే రోజు. కుటుంబ సభ్యులు, ప్రియమైన వారితో కలిసి భోజనం చేయడం, ఆనందాన్ని పంచుకోవడమే ఈ పండుగ యొక్క అసలైన సారాంశం.





