కోర్టును ఆశ్రయించిన సంగీత విజయ్
విడాకులు ఇప్పించాలంటూ కోర్టులో పిటిషన్
తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య సంగీత సంచలన ఆరోపణలు చేశారు. ఐదేళ్ల కిందటే తాము మానసికంగా విడిపోయామని విజయ్ భార్య సంగీత అన్నారు. విజయ్‌కి ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ఆ నటితో విదేశాలకు, పార్టీలకు విజయ్ వెళ్తారని చెప్పుకొచ్చారు. విజయ్ తనను వేధింపులకు గురి చేస్తున్నారని.. ఇది ఇలాగే కొనసాగితే ఆ నటి పేరు బయటపెడతానంటూ సంగీత హెచ్చరించారు.
1999లో ప్రేమ వివాహం.. కొన్నేళ్లుగా విభేదాలు
విజయ్, సంగీత వివాహం 1999లో జరిగింది. సంగీత లండన్‌కు చెందిన తమిళ కుటుంబానికి చెందినవారు. విజయ్ నటుడిగా ఎదుగుతున్న సమయంలో ఆయన అభిమానిగా సంగీత పరిచయం అయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, వివాహమైన కొంతకాలం తర్వాతే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ప్రారంభమయ్యాయి. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సంగీత విడాకులు కోరుతూ పిటిషన్ వేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
వివాహేతర సంబంధం ఆరోపణలు
విజయ్, త్రిషకు మధ్య సంబంధం ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల తమిళనాడుకు చెందిన కొందరు రాజకీయ నేతలు సైతం ఇవే కామెంట్స్ చేశారు. విజయ్ త్రిష ఇంటిని విడిచి ప్రజల్లోకి రావాలంటూ బీజేపీ నాయకుడు నయినర్ నాగేంద్రన్ కామెంట్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాట పెద్ద వివాదానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా స్పందించడం.. ఆ తర్వాత నాగేంద్రన్ క్షమాపణలు చెప్పడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. ఇంతలో సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో.. విజయ్ – త్రిష రిలేషన్ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.
విజయ్ రాజకీయ జీవితంపై ప్రభావం
విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని ఆయన రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా అనే చర్చ జరుగుతోంది. అయితే, విజయ్ అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు ఇది వ్యక్తిగత విషయం అని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు పూర్తి వివరాలు వెలుగులోకి రావాలని కామెంట్స్ చేస్తున్నారు.
