తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలు రెడీ చేసింది. సంక్రాంతికి రైతు భరోసా నిధులు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం… ఇందుకు సంబంధించి తుది నిబంధనలు ఖరారు చేసిందని తెలుస్తోంది. గత ప్రభుత్వం రైతులందరికి రైతు బంధు ఇవ్వగా.. రైతు బంధు పేరును పైకు భరోసాగా మార్చిన కాంగ్రెస్ సర్కార్.. దాదాపు 20 లక్షల మందికి ఎసరుపెట్టేలా కొత్త రూల్స్ తీసుకొచ్చిందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన తరహాలోనే కొత్త నిబంధనలు పెట్టారని సమాచారం.
గత ప్రభుత్వంలో దాదాపు 65 లక్షల మంది రైతులకు రైతు బంధు వచ్చింది. అయితే పీఎం కిసాన్ యోజనలో మాత్రం కేవలం 23 లక్షల మందే అర్హులుగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సగం మందికి కట్ చేసి దాదాపు 35 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమవుతోందని అంటున్నారు. మంత్రుల సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐటీ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు రైతు భరోసా కట్ చేయనున్నారు.
రైతు భరోసా మార్గదర్శకాలు సిద్దం చేసిన తెలంగాణ ప్రభుత్వం..పీఎం కిసాన్ తరహాలోనే కఠిన నిబంధనలు పెట్టినట్లు తెలుస్తోంది. కుటుంబంలో ఎంతమంది పేరిట భూమి ఉన్నా అందరిదీ ఒకే లెక్కన కట్టి కుటుంబం యూనిట్ లాగా తీసుకొని గరిష్టంగా ఏడెకరాల వరకే రైతుబంధు పరిమితం చేసి అంతవరకే రైతు భరోసా ఇచ్చేందుకు సిద్దమవుతోంది ప్రభుత్వం. ఇలా చేస్తే కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.