అంతర్జాతీయం

Putin India Tour: ఇవాళ భారత్‌ కు పుతిన్‌.. రెండు రోజుల పాటు పర్యటన!

రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ భారత్ కు రానున్నారు. ఆయన చివరి సారిగా 2021లో భారత్ కు వచ్చారు.

India-Russia: రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోళ్లు చేస్తుందనే నెపంతో భారత్ మీద అమెరికా భారీగా సుంకాలు విధించిన వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు రాబోతున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు.  సాయంత్రం 7 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చే ప్రైవేట్‌ డిన్నర్‌కు హాజరవుతారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం.. పుతిన్‌ రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మగాంధీకి నివాళులర్పిస్తారు.

హైదరాబాద్ హౌస్ లో కీలక సమావేశం

ఆ తర్వాత హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోడీ-పుతిన్‌ సమావేశం అవుతారు. భేటీ అనంతరం ఇద్దరు నేతలూ కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు. ఆ తర్వాత ప్రధాని మోడీ ఇచ్చే వర్కింగ్‌ లంచ్‌కు పుతిన్‌ హాజరవుతారు. అనంతరం ఢిల్లీలోని భారత్‌ మండపంలో.. ఫిక్కీ   నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించే విందు కార్యక్రమానికి పుతిన్‌ హాజరవుతారు. దీంతో పుతిన్‌ భారత పర్యటన పూర్తవుతుంది.

రష్యా-భారత్ నడుమ కీలక ఒప్పందాలు

అటు పుతిన్‌తో పాటు ఈ పర్యటనకు వస్తున్న రష్యా రక్షణ మంత్రి అంద్రే బెలొసోవ్‌ మన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఇవాళ భేటీ కానున్నారు. మరో ఐదు యూనిట్ల ఎస్‌-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు, ఎస్‌యు-30 ఫైటర్‌ జెట్ల నవీకరణ, ఇతరత్రా కీలకమైన మిలటరీ హార్డ్‌వేర్‌ సరఫరా అంశాలు వీరి భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. అలాగే.. పౌరు అణు ఇంధన సహకారానికి సంబంధించి కూడా ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి రష్యా క్యాబినెట్‌ ఇప్పటికే ఓకే చెప్పింది. రష్యాకు చెందిన రోసాటోమ్‌ న్యూక్లియర్‌ కార్పొరేషన్‌.. తమిళనాడులోని కూడంకుళంలో న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ను నిర్మిస్తున్నది. రష్యా ప్రభుత్వం తరఫున ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి ఆ సంస్థకు రష్యా క్యాబినెట్‌ అధికారం ఇచ్చింది.

ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం

అటు పుతిన్‌ రాకకు ముందే.. రష్యా ప్రెసిడెన్షియల్‌ సెక్యూరిటీ సర్వీస్ కు చెందిన దాదాపు 50 మంది టాప్ కమాండోలు భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు, ఇండియన్‌ నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ తో కలిసి వీరు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటన కోసం పుతిన్‌ రష్యాలో వాడే ప్రెసిడెన్షియల్‌ లగ్జరీ లిమోజిన్‌ కారు ఆరస్‌ సెనాట్‌ ఉపయోగించనున్నారు. దీనిని మాస్కో నుంచి విమానంలో ప్రెసిడెంట్ తో పాటు తీసుకురానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button