తెలంగాణ

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు సిద్ధం..!

హైదరాబాద్(క్రైమ్ మిర్రర్):-తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగినట్లే.. మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచే సమ్మె చేయనున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు.. కార్మికుల సమస్యల పరిష్కారమై జనవరి 27న ఇచ్చిన సమ్మె నోటీసుపై ఆర్టీసీ సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం, లేబర్‌ కమిషన్ల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, సోమవారం చలో లేబర్‌ కమిషనర్‌ ఆఫీస్‌ కార్యక్రమాన్ని చేపట్టామని జేఏసీ నాయకులు తెలిపారు.. అయినప్పటికీ ఆర్టీసీ యాజమాన్యంలో ఎలాంటి స్పందన లేకపోవడంతో, మే 6వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్టు వారు వెల్లడించారు.. మే 7వ తేదీ తెల్లవారు జాము నుంచే ఎక్కడి బస్సులు అక్కడే డిపోలకే పరిమితమవుతాయని, జేఏసీ చైర్మన్‌ వెంకన్న, కోచైర్మన్‌ హన్మంత్‌ వైస్‌ చైర్మన్‌ థామస్‌రెడ్డి, కన్వీనర్‌ ఎండీ మౌలాన, కోకన్వీనర్లు యాదయ్య, సురేశ్‌, యాదగిరి అన్నారు.. ఇక ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు రాకపోవడం వల్లే మే 6 అర్ధరాత్రి నుంచే సమ్మె చేపడుతున్నట్టు తెలుపుతూ, జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ సునీతా గోపాల్‌దాస్‌కు లేఖను ఇచ్చారు.

విలీనం ఉత్తమాటేనా..!?

లేబర్‌ కమిషనర్‌ కార్యాలయంలో జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి జేఏసీ నాయకులు మాట్లాడారు.. డిమాండ్లు సాధించేందుకు చేస్తున్న ఈ పోరాటంలో అన్ని కార్మిక సంఘాలు కలిసిరావాలని ఆయన కోరారు. సమ్మె నోటీసులో 21 అంశాలను ప్రస్తావించినట్లు, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం, యాజమాన్యాలను ఎన్నో విధాలుగా ఒత్తిడి చేసినప్పటికీ, వారినుండి స్పందన రాలేదన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చినప్పటికీ.. నేటివరకు ఆ సమస్య దారిన పడలేదని విమర్శించారు.. ట్రేడ్‌ యూనియన్లను పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో హామీలిచ్చినా ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ట్రేడ్‌ యూనియన్ల ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే తీవ్ర వేధింపులకు గురవుతున్నారన్నారు..

2017లో వేతన సవరణ జరిగినప్పటికీ, ఇంతవరకు బకాయిలు రాకపోవటం భాధాకరమని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వాటి ఫిక్సేషన్లను వెంటనే ఎరియర్స్‌ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. నేటికీ పాత అలవెన్స్‌లనే అమలు చేస్తూ, కార్మికుల శ్రమశక్తిని యాజమాన్యం దోపిడీ చేస్తుందని విమర్శించారు. 2021 వేతన సవరణ కాలపరిమితి ముగిసినందున, వెంటనే వేతన సవరణ జరిపి కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button