
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థి ఇచ్చిన ఓ హామీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డు నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి ఆంజనేయులు, తన వార్డులో పుట్టే ప్రతి ఆడపిల్లకు రూ.10,000 ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. ఆడశిశువు పుట్టుకను ప్రోత్సహించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టంగా తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ హామీని ప్రకటించిన ఆంజనేయులు, సమాజంలో ఆడపిల్లల పట్ల ఉండే వివక్షను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. మహిళల సంక్షేమానికి తాను ప్రాధాన్యం ఇస్తానని, ఆడపిల్ల పుట్టుకను భారంగా కాకుండా గర్వంగా భావించే పరిస్థితి రావాలని అన్నారు. ఈ ప్రకటన వార్డులోని ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది.
అదే సమయంలో రోజువారీ కూలీ కుటుంబాలను ఉద్దేశించి మరో కీలక హామీని కూడా ఆయన వెల్లడించారు. తన వార్డు పరిధిలో రోజువారీ కూలీ కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే, ఆ కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందిస్తానని ఆంజనేయులు తెలిపారు. పేద కుటుంబాలు ఎదుర్కొనే ఆకస్మిక ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ సాయం చేస్తానని చెప్పారు.
ఈ రెండు హామీలు కలిసి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీశాయి. కొందరు దీనిని సామాజిక బాధ్యతగా ప్రశంసిస్తుండగా, మరికొందరు ఎన్నికల హామీలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయినప్పటికీ జనసేన అభ్యర్థి ప్రకటన వనపర్తి రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపినట్లు కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ తరహా హామీలు ఓటర్లపై ఎంత ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
ALSO READ: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇకపై ఏటీఎం, యూపీఐతోనే పీఎఫ్ విత్‌డ్రా!



