Rahul Gandhi: రాష్ట్రపతి భవన్‌ విందులో గమోసాను పక్కనబెట్టిన రాహుల్, బీజేపీ ఆగ్రహం!

రాష్ట్రపతి భవన్‌లో సోమవారం విందు వేళ రాహుల్‌గాంధీ అస్సామీ కండువా గమోసాను ధరించక పోవడం రాజకీయ వివాదాన్ని సృష్టించింది. అసోం సీఎం బిశ్వ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rahul Gandhi Controversy: రాష్ట్రపతి భవన్‌లో తాజాగా జరిగిన విందు సందర్భంగా రాహుల్‌ గాంధీ అస్సామీ కండువా గమోసాను  ధరించక పోవడం రాజకీయ వివాదాన్ని సృష్టించింది. రాష్ట్రపతి విందులో అతిథులందరికీ అస్సామీ సంప్రదాయ కండువా గమోసా మెడలో వేసి స్వాగతం పలికారు. అతిథులందరూ ఆ కండువాతో కనిపించగా, రాహుల్‌గాంధీ కండువా లేకుండా కనిపించారు.

రాహుల్ పై అసోం సీఎం ఆగ్రహం

రాహుల్‌ గమోసాను తిరస్కరించడం అసోం ప్రజలను, ఈశాన్య రాష్ట్రాలను అవమానించడమేనని రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ చర్య ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని తృణీకరించినట్లుగా ఉందన్నారు. రాహుల్‌  ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాహుల్‌ గాంధీ ఈశాన్య రాష్ట్రాలనే కాకుండా ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా అవమానించారని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా ఆరోపించారు.

బీజేపీ ఆరోపణలపై స్పందించిన కాంగ్రెస్

బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. రాహుల్‌గాంధీ కండువాను ధరించారని, తర్వాత తీసి చేతిలో పట్టుకున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా కండువా ధరించలేదన్నారు. రాజ్‌నాథ్‌సింగ్‌ నుంచి ముందు క్షమాపణ చెప్పించాలని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా సూచించారు. కాగా, రాహుల్‌ని పిరికిపందగా అభివర్ణించి, కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన బిహార్‌ నాయకుడు షకీల్‌ అహ్మద్‌.. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తాజాగా వ్యాఖ్యానించారు. తన ఇళ్లపై దాడులు చేయాలని యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలకు పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసినట్లు తనకు తెలిసిందని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button