* కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తా
* నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ ఓపెన్ ఆఫర్
* పూర్తి పట్టు సాధించిన హరీష్ రావు
* ఆయనను ఓడించడం అంటే అసాధ్యం అంటున్న విశ్లేషకులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: సిద్దిపేటలో కాంగ్రెస్ గెలుస్తుందా? హరీష్ రావును ఓడిస్తుందా? కెసిఆర్ కుటుంబాన్ని అక్కడి నుంచి లేకుండా చేస్తుందా? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించారు. దశాబ్దాలుగా ఒకే కుటుంబానికి అవకాశం ఇస్తున్న సిద్దిపేట ప్రజలు.. కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరారు. అలా ఇస్తే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేను మంత్రిని చేస్తానంటూ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అయితే రేవంత్ విజ్ఞప్తి చేశారు ఓకే. కానీ సిద్దిపేట నుంచి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా? అనేది ఇప్పుడు కొత్త చర్చ.
రెండు దశాబ్దాలకు పైగా..
రెండు దశాబ్దాలకు పైగా సిద్దిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, తన్నీరు హరీష్ రావు. ప్రతి గడప ఆయనకు తెలుసు. గణనీయమైన అభివృద్ధితో అక్కడి ప్రజల మనసును గెలుచుకున్నారు. హరీష్ రావు లేని రాజకీయం సిద్దిపేటలో లేదు. ఆయన మద్దతు ఉంటేనే వార్డు సభ్యుడు నుంచి పెద్ద స్థాయి లీడర్ వరకు ఎదిగేది. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరితోనూ తన సంబంధాలు మెరుగుపరుచుకుంటూ వచ్చారు. కెసిఆర్ సిద్దిపేట నుంచి నాలుగు సార్లు గెలిస్తే.. హరీష్ రావు మాత్రం ఐదుసార్లు వరుసగా గెలిచారు. అటువంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారు అని రేవంత్ రెడ్డి అనడంలో తప్పులేదు కానీ… అతిగా నమ్మకం పెట్టుకోవడం మాత్రం ఇబ్బందికరమే.
నాలుగు దశాబ్దాల కిందట కాంగ్రెస్..
చివరిసారిగా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 1983లో. 1985 నుంచి 2001 ఉప ఎన్నిక వరకు గెలుస్తూ వచ్చారు కెసిఆర్. ఆ నియోజకవర్గ నుంచి గెలిచిన ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రి అయ్యారు. డిప్యూటీ స్పీకర్ కూడా అయ్యారు. 1999లో టిడిపి తరఫున గెలిచి తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసి సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. 2001లో టిఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు కెసిఆర్. అటు తరువాత ఆ నియోజకవర్గాన్ని హరీష్ రావుకు విడిచిపెట్టారు. హరీష్ రావు ఆ నియోజకవర్గాన్ని గులాబీ పార్టీకి కంచుకోటగా మార్చేశారు. ఇప్పుడు హరీష్ రావును ఓడిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం చూస్తుంటే మాత్రం అదో సాహసం అనే చెప్పాలి. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావును ఓడించాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు రేవంత్ రెడ్డి. అందుకే సిద్దిపేట ప్రజలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.
మంత్రిగా హ్యాట్రిక్..
అయితే ఇదే హరీష్ రావు తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది టిఆర్ఎస్. ఆ ఎన్నికల్లో గెలిచారు హరీష్ రావు సిద్దిపేట నుంచి. అలా రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. 2009లో రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. కెసిఆర్ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖను దక్కించుకున్నారు. 2018లో మరోసారి గెలిచి మంత్రివర్గంలో చేరారు. తెలంగాణలో కీలక నేతగా మారిపోయారు. అయితే మొన్నటి ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోవడంతో హరీష్ రావును ఎలాగైనా పడగొట్టాలని రేవంత్ భావిస్తున్నారు. అందుకే సిద్దిపేట ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఒకవేళ రేవంత్ కోరినట్టు సిద్దిపేట ప్రజలు కాంగ్రెస్కు అవకాశం ఇస్తే మాత్రం హరీష్ రావు పొలిటికల్ కెరీర్ ముగిసినట్టే. కానీ అది ఎంత మాత్రం సాధ్యం కాదని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. అంతలా సిద్దిపేట ను కంచుకోటగా మార్చేశారు హరీష్ రావు. అయితే ఈ ఇద్దరిలో ఎవరి మాట నెగ్గుతుందో అన్నది 2028లో తేలనుంది.
