
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి ఎదురీదుతున్నారా…? అందరినీ కలుపుకుపోయేందుకు శక్తికి మించి కష్టపడుతున్నారా…? ఓవైపు సీనియర్లు.. మరోవైపు గ్రూపులు.. ఆపై హైకమాండ్… అన్నింటినీ చక్కబెట్టలేక సతమతమవుతున్నారా..? ఇన్ని సవాళ్ల మధ్య హస్తం పార్టీలో ఆయన ఎంతకాలం నెగ్గుకురాగలుగుతారు..? ఎందుకో గాని… ఇటీవల ఈ అంశంపై చర్చ కాస్త గట్టిగానే జరుగుతోంది.
కాంగ్రెస్… అదో మహాసముద్రం. ఇందులో ఈదడం అంత ఈజీ కాదు. ఎంతో సినియారిటీ ఉన్న వాళ్లే తడబడుతుంటారు. వైఎస్ రాజశేఖర్ లాంటి వాళ్లకు కూడా సీనియర్లతో ఇబ్బందులు తప్పలేదు. అలాంటిది.. కాంగ్రెస్‌తో పదేళ్లు కూడా రాజకీయ బంధంలేని రేవంత్‌రెడ్డికి… ఇకెంత కష్టమో ఊహించవచ్చు. అయినా.. ఆయన సీనియర్లు అందరినీ దాటి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. అది ఆయన ఆదృష్టం కావొచ్చు. అయితే… ఆ పదవిని ఎంత కాలం నిలబెట్టుకోగలరు..? అన్నదే ఇక్కడ ప్రశ్న.
కాంగ్రెస్ పార్టీలో ఎంత మంది సీనియర్లు ఉన్నారో… అంతకు మంది గ్రూపు రాజకీయాలు, కుర్చీల కోసం కొట్లాటలు జరుగుతుంటాయి. వీటిని ఎదుర్కొని నెగ్గుకురావడం అంటే… మామూలు విషయం కాదు. అయినా… రేవంత్‌రెడ్డి శక్తికి మంచి ప్రయత్నిస్తున్నారు. మాటకారి తనం… ప్రత్యర్థులపై పంచుల వర్షం.. ప్రజాకర్షణ ఇవన్నీ ఆయనకు ప్లస్ అయి ఉండొచ్చు. కానీ… కాంగ్రెస్ పార్టీలో నెగ్గుకురావడానికి అవి మాత్రమే సరిపోవు. కురు వృద్ధులు.. సీనియర్ల సమూహంతో నడుస్తున్న పార్టీలో రేవంత్‌రెడ్డి మాట ఎంత వరకు… ఎప్పటి వరకు చెల్లుతుంది…? రేవంత్‌రెడ్డి చుట్టూ ఉన్న మంత్రుల్లో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేల్లోనూ సీనియర్లు ఉన్నారు. ఎవరినీ తోసిపుచ్చలేరు. అందరి మాట తీసుకోవాలి. ఎక్కడ కాస్త తేడా వచ్చినా… అసలుకే ఎసరు వస్తుంది. వ్యవహారం మొత్తం చెడుతుంది. పైగా.. హైకమాండ్ దగ్గర ఇంప్రెషన్ కూడా పోగొట్టుకోకూడదు. ఎప్పటి కప్పుడు వారి మెప్పు పొందుతూనే ఉండాలి. వీటన్నిటి చాలా జాగ్రత్తగా మేనేజ్‌చేస్తూ వస్తున్నారు రేవంత్‌రెడ్డి.
ఇక.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. ప్రజలు, ప్రతిపక్షాలు ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీలు సరిగా అమలు చేయడంలేదన్న అపవాదు ప్రభుత్వంపై పడుతోంది. ఈ వ్యతిరేకతను.. ప్రత్యర్థులతోపాటు సొంతపార్టీలోని రేవంత్‌రెడ్డి వ్యతిరేకవర్గం కూడా వారికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. అలాంది జరగకుండా చూసుకోవాల్సి బాధ్యత కూడా రేవంత్‌రెడ్డిపైనే ఉంది. ఇలా పూటకో పరీక్ష.. సెకనుకో సవాల్ ఎదర్కోవడమంటే పెద్ద టాస్కే. అయితే ఇలా ఎంతకాలం…? అన్న ప్రశ్న ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది. ఇన్ని పరీక్షల మధ్య ఆయన ఇంకెంత కాలం నెగ్గుకురాగలరు…? అన్నది చూడాలి.