కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు షాక్
తన మంత్రివర్గంలో సిద్దిపేట ఎమ్మెల్యే కు మంత్రి పదవి
సిద్దిపేట రైతు భరోసా సభలో రేవంత్ రెడ్డి క్లారిటీ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:తెలంగాణకు మరోసారి రేవంత్ సీఎం అవుతారా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరోసారి ఆయనే ముఖ్యమంత్రి కావడం ఖాయమా? అంటే అవుననే అంటున్నారు రేవంత్ రెడ్డి. సిద్దిపేట సభలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
మరోసారి తెలంగాణ రాష్ట్రానికి తానే సీఎం అని.. సిద్దిపేట నుంచి గెలిచినవారు తన మంత్రివర్గంలో పని చేస్తారు అని తేల్చి చెప్పారు. దీంతో సొంత పార్టీలో సీనియర్లకు షాక్ ఇచ్చారు. అదే సమయంలో గులాబీ పార్టీకి సైతం గట్టి హెచ్చరికలు పంపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రేవంత్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
స్వల్ప కాలంలోనే సీఎం గా..
స్వల్ప కాలంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2014 ఎన్నికల్లో ప్రజలు గుర్తించలేదు. 2018 ఎన్నికల్లోను ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ పార్టీలో కాకలు తీరిన యోధులు కూడా ఉండేవారు.
కానీ వారంతా నిస్సహాయత వ్యక్తం చేసేవారు. అటువంటి సమయంలోనే కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించారు రేవంత్ రెడ్డి. ముందుగా పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ పదవితోనే కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు.
సుదీర్ఘ పాదయాత్రతో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అని ప్రజలను గుర్తు చేశారు. ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. దానిని తెలంగాణ ప్రజలు గుర్తించి కాంగ్రెస్ ను గెలిపించారు.
ఆశావహులు అధికం..
తెలంగాణలో రాకరాక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం చాలామంది సీనియర్లు ప్రయత్నాలు చేశారు. హై కమాండ్ ఆ సీటును రేవంత్ రెడ్డికి ఇచ్చేందుకు అనేక ప్రయాసలు పడింది. అనేకమంది సీనియర్లను బుజ్జగించి ఒప్పించింది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తన రెండున్నర ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారు.
మరో రెండున్నర సంవత్సరాలు కూడా ఆయన పదవిలో ఉండడం ఖాయం. అయితే మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు ముఖ్యమంత్రిగా తమకు అవకాశం ఇస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు చాలామంది ఆశలు పెట్టుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం నేతలతో పాటు ఎస్సీ సామాజిక వర్గం నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
బీసీ నేతలు సైతం ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎన్నికలకు చాలా సమయం ఉండడంతో ఎవరూ బయటపడడం లేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి పదవి పై తాజాగా తేల్చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన రైతు భరోసా సభలో ఆయన చేసిన వ్యాఖ్యలతో ఫుల్ క్లారిటీ వచ్చింది. గులాబీ పార్టీకి అవకాశం ఇచ్చినట్టే కాంగ్రెస్ పార్టీకి కూడా రెండోసారి తెలంగాణ ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు.
అయితే అంతటితో ఆగలేదు. సిద్దిపేట నుంచి ఎవరు గెలిచినా నా మంత్రివర్గంలో చోటు ఖాయమని.. మంత్రి పదవి ఖాయమని తేల్చి చెప్పారు. తద్వారా 2028లో ఏర్పడబోయే ప్రభుత్వంలో తానే సీఎం అని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి.
బీసీ ముఖ్యమంత్రి అంటూ ప్రకటనలు..
గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిపై చాలా రకాల ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో బీసీ గణన చేసిన ఆయన.. 43 శాతం మంది బీసీలు ఉన్నారని.. వారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కల్పించాలని.. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు.. అది కాకుండానే రెడ్డి సీఎం లలో తానే చివర సీఎం కావచ్చు అని కూడా ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.
తత్వారా బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న సంకేతాలు ఇచ్చారు. కానీ తాజాగా సిద్దిపేట సభలో మాత్రం.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. తానే సీఎం అని తేల్చి చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు షాక్ ఇచ్చారు. ప్రజలకు స్పష్టమైన సంకేతాలు పంపడంలో సక్సెస్ అయ్యారు.
