
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ మెడకు ఉచ్చులా బిగుస్తున్న నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చార్జ్‌షీట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును చేర్చినట్లు తెలియవస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో ఇప్పుడు రేవంత్ పేరు బయటకు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ టాప్ నేతలపై ఇప్పటికే ఈడీ విచారణలు జరిపిన నేపథ్యంలో ‘యంగ్ ఇండియా’ పేరుతో విరాళాలు సేకరించి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు రేవంత్ పై రావడం గమనార్హం. పదవుల కోసం విరాళాల పేరుతో వసూళ్లు జరిగాయని, ఏఐసీసీ కి అవినీతి బ్యాగులు చేరవేశారని ఈడీ చార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు సమాచారం.
రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నది : ‘ఓటుకు నోటు’ తరహాలో మరో అవినీతికి రేవంత్ పాల్పడ్డాడా అన్న సందేహాన్ని ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లో సైతం రేకెత్తిస్తోంది. ఒకవేళ ఈడీ విచారణలో రేవంత్ కు సమన్లు జారీ చేస్తే, ఈ వ్యవహారం మరింత ఊహించని మలుపులు తిరిగే అవకాశమూ లేక పోలేదు.
కాంగ్రెస్ అధిష్టానంపై కూడా ప్రశ్నల వర్షం : “అవినీతి పరులను తరిమికొడతామని ప్రకటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…ఇప్పుడు రేవంత్, డీకే శివకుమార్ లాంటి నేతలపై ఎలా స్పందిస్తారో.. ? ” అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తుతున్నాయి. సోనియాగాంధీతో పాటు రేవంత్ లాంటి నేతల అవినీతి వ్యవహారాలపై పారదర్శకతతో సమాధానం చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ముందున్న పెద్ద సవాల్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కక్ష సాధింపు చర్యల్లో భాగమే : అయితే రేవంత్ మాత్రం ఈ వ్యవహారాన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కొట్టి పారెయ్యొచ్చనే పుకార్లు సైతం షికార్లు చేస్తున్నాయి. కానీ, ఈడీ తన చార్జ్‌షీట్‌లో రేవంత్ పేరును ఎందుకు ప్రస్తావించింది ? ఈడీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏమిటి ? అనే విషయాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అంతే కాకుండా ఈడీ రేవంత్ ను విచారణకు పిలుస్తుందా లేదా అన్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.